అమెరికాలో లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తెలుగు మహిళ అరుణ
మొదటి నుంచి రాజకీయాల పట్ల ఎక్కువ ఇష్టం చూపే అరుణ.. 2000లో అమెరికా పౌరురాలిగా మారిన తర్వాత డెమోక్రాట్ పార్టీకి అభిమానిగా ఉన్నారు.
అమెరికాలో జరుగుతున్న మిడ్ టర్మ్ ఎన్నికల్లో తెలుగు నేపథ్యం ఉన్న మహిళ సత్తా చాటింది. మేరీలాండ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ ఎన్నికైంది. యూఎస్ చరిత్రలో ఒక భారత మూలాలున్న వ్యక్తి లెఫ్టినెంట్ గవర్నర్ కావడం ఇదే తొలి సారి. ఏపీలో పుట్టిన కాట్రగడ్డ అరుణ.. మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. మొదటి నుంచి రాజకీయాల పట్ల ఎక్కువ ఇష్టం చూపే అరుణ.. 2000లో అమెరికా పౌరురాలిగా మారిన తర్వాత డెమోక్రాట్ పార్టీకి అభిమానిగా ఉన్నారు.
అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం పూర్తయ్యాయి. వీటి ఫలితాలు ప్రస్తుతం ప్రకటిస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి గవర్నర్ పదవికి వెస్ మూర్, లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి అరుణ పోటీ చేశారు. వీరిద్దరూ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులపై ఘన విజయం సాధించడం విశేషం. గవర్నర్ తర్వాత మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నరే అత్యున్నత హోదా కలిగి ఉంటారు.
అరుణ మొదటి నుంచి మేరీలాండ్ ప్రజలకు సుపరిచితురాలు. రిపబ్లికన్ పార్టీకి చెందిన వాళ్లు కూడా ఆమెకు మద్దతు తెలిపారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , వైస్ ప్రెసిడెంట్ కమలా హారీస్ ఆమె కోసం విస్తృతంగా పని చేశారు. దీంతో ఆమెకు మరింత మంది ఓట్లేసినట్లు అమెరికా మీడియా పేర్కొన్నది.