అంబులెన్స్ పక్కన ఆపి మద్యం తాగి.. పేషెంట్‌కు పెగ్ పోసిన డ్రైవర్
వైన్ షాపు ముందు హఠాత్తుగా ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన డ్రైవర్ షాపులో మద్యం, రెండు గ్లాసులు కొన్నాడు.
పేషెంట్లను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించాలంటే అంబులెన్సును వాడతారు. ప్రాణాలు కాపాడేది డాక్టర్ అయినా.. అంత కంటే ముందు వేగంగా ఆసుపత్రికి చేర్చే అంబులెన్స్ డ్రైవర్ చేసే సేవ కూడా మరువలేనిది. అంబులెన్స్ వస్తుందంటే పీఎం మోడీ, సీఎం జగన్ కూడా దారి ఇచ్చిన వీడియోలు మనం చూశాం. ట్రాఫిక్ సిగ్నల్ పడినా పోలీసులు అంబులెన్సుకు దారి ఇస్తుంటారు. అంబులెన్స్ అంటే అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక అంబులెన్స్ డ్రైవర్ మాత్రం రోగిని లోపల పెట్టుకొని తీరిగ్గా వైన్ షాప్ పక్కన ఆపి మద్యం తాగాడు. అంతే కాకుండా పేషెంటుకు కూడా ఒక పెగ్ పోశాడు. ఈ సంఘటన ఒడిషాలో చోటు చేసుకున్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
ఒడిషా జిల్లా జగత్‌సింగ్‌పూర్ జిల్లా తిర్తోల్ హైవే పక్కన ఒక మద్యం షాపు ఉన్నది. సోమవారం ఆ షాపు ముందు హఠాత్తుగా ఒక అంబులెన్స్ వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన డ్రైవర్ షాపులో మద్యం, రెండు గ్లాసులు కొన్నాడు. తీరిగ్గా అంబులెన్పు దగ్గరకు వెళ్లి తాను ఒక గ్లాసులో మద్యం పోసుకొని గుటుక్కున తాగాడు. ఆ తర్వాత పేషెంటుకు కూడా పోయగా.. కాలి గాయంతో కట్టుకొట్టుకొని ఉన్న అతడు..నెమ్మదిగా లేచి సిప్ చేస్తూ కనపడ్డాడు. దీన్ని అక్కడే ఉన్న కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. అదే అంబులెన్సులో పేషెంట్‌తో పాటు ఒక మహిళ, చిన్నారి కూడా ఉండటం కూడా గమనార్హం.
పేషెంటును పెట్టుకొని అంబులెన్స్ ఎందుకు ఆపావని? పైగా డ్రైవర్‌వి అయ్యుండి మద్యం ఎందుకు తాగుతున్నావని స్థానికులు ప్రశ్నించారు. అయితే మద్యం కొనమని పేషెంటే డబ్బులు ఇచ్చాడని.. ఆయన కాలి నొప్పి ఎక్కువగా ఉండటంతో మద్యం సేవించాడని డ్రైవర్ చెప్పాడు. అయితే, డ్రైవింగ్ చేస్తూ మద్యం ఎందుకు తాగుతున్నావని అడగ్గా.. తాను లిమిట్‌లోనే తాగాను అని చెప్పుకొచ్చాడు. అంబులెన్స్ మద్యం తాగిన విషయాన్ని స్థానిక జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ క్షేతాబాసి దాస్ దృష్టికి తీసుకొని వెళ్లారు.
అది ప్రైవేట్ అంబులెన్స్.. మాకు దానికి సంబంధించిన సమాచారం లేదు. అయితే ఆర్టీవో అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకొని వెళ్తాము. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డ్రైవర్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు.. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు తిర్తోల్ ఇన్‌స్పెక్టర్ జుగల్ కిషోర్ దాస్ తెలిపారు.