కన్నతండ్రిపై వల్లమాలిన ప్రేమతో.. - ఆ కుమారుడు ఏం చేశాడంటే..
తన పెళ్లి చూడాలని ఆశపడిన తన తండ్రి కోరికను ఎలాగైనా నెరవేర్చాలనుకున్నాడు ఆ కుమారుడు. దానిని నెరవేర్చడం కోసం తండ్రి భౌతికకాయం ఎదుటే యువతిని వివాహమాడాడు. తమిళనాడులోని కళ్లక్కురిచ్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆ ఇంట కుమారుడి పెళ్లి సందడి మొదలైంది. ఈ నెల 27వ తేదీనే ముహూర్తంగా నిశ్చయించారు. దీంతో ఇంట్లోవారంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీబిజీగా ఉన్నారు. అదే సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న పెళ్లి కుమారుడి తండ్రి కన్నుమూశాడు. కన్నతండ్రి కన్నుమూయడం ఆ కుమారుడికి తీవ్ర వేదనను మిగిల్చింది. తండ్రి భౌతిక కాయం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించాడు. అదీ తాను పెళ్లి చేసుకునే గడువు సమీపించిన సమయంలో తండ్రి శాశ్వతంగా దూరంకావడాన్ని తట్టుకోలేకపోయాడు.
తన పెళ్లి చూడాలని ఆశపడిన తన తండ్రి కోరికను ఎలాగైనా నెరవేర్చాలనుకున్నాడు ఆ కుమారుడు. దానిని నెరవేర్చడం కోసం తండ్రి భౌతికకాయం ఎదుటే యువతిని వివాహమాడాడు. తమిళనాడులోని కళ్లక్కురిచ్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కళ్లక్కురిచ్చి సమీపంలోని పెరువంగూర్ గ్రామానికి చెందిన పంచాయతీ యూనియన్ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రవీణ్‌కు ఈ నెల 27న పెళ్లి నిశ్చయించి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఆయన మృతిచెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
రాజేంద్రన్ అంత్యక్రియలకు చెన్నైకి చెందిన వధువు స్వర్ణమాల్య తన కుటుంబంతో పాటు అక్కడికి చేరుకున్నారు. తన తండ్రి చివరి కోరిక తీర్చేందుకు ఆయన భౌతికకాయం ఎదుటే వివాహం చేసుకోవాలనే తన ఆలోచనను ప్రవీణ్ వధువుతో పంచుకున్నాడు. అందుకామె అంగీకరించడంతో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో భౌతికకాయం ఎదుటే వివాహం చేసుకున్నారు. ఆ విధంగా తన తండ్రిపై ఉన్న వల్లమాలిన ప్రేమాభిమానాలను చాటుకున్నాడు ఆ కుమారుడు. ఈ ఘటన చూసిన స్థానికులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. మనుషుల మధ్య బంధాల విలువలు, మానవతా విలువలు తరిగిపోతున్న తరుణంలో ఆ కుమారుడు చేసిన పని.. అందరితో శభాష్ అనిపిస్తోంది.