భారత ప్రజల ఆరోగ్య స్ధితిపై నిజాలు చెప్పాడని.. ఆ ప్రొఫెసర్‌ను తప్పించిన కేంద్ర ప్రభుత్వం
ఈ ఏడాది జూలై 28న ప్రొఫెసర్ కేఎస్ జేమ్స్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. 5వ దశ ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్‌పై కేంద్రానికి ఉన్న అసంతృప్తి కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.
మన దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన విధానాలు రూపొందించాలంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్)ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సర్వేను ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్(ఐఐపీఎస్) రూపొందిస్తుంది. గతేడాది ఐఐపీఎస్ చేపట్టిన సర్వేలో ఇండియాలో రక్తహీనతతో బాధపడే వాళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్నదని తేలింది. అయితే, ఈ సర్వేలోని గణాంకాలు మార్చాలని ఐఐపీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎస్ జేమ్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. అయినా సరే కేఎస్ జేమ్స్ సర్వేలో నిజాలనే ఉటంకిస్తూ రిపోర్టు విడుదల చేశారు. దీంతో ప్రొఫెసర్ కేఎస్ జేమ్స్‌ను ఒక పథకం ప్రకారం పదవి నుంచి తప్పించినట్లు సహచర ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఈ ఏడాది జూలై 28న ప్రొఫెసర్ కేఎస్ జేమ్స్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. 5వ దశ ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్‌పై కేంద్రానికి ఉన్న అసంతృప్తి కారణంగానే ఈ చర్య తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తన పదవికి రాజీనామా చేస్తానని ఆరోగ్య శాఖకు జేమ్స్ చెప్పారు. దీంతో అక్టోబర్ 11న జేమ్స్‌పై ఉన్న సస్పెన్షన్ ఎత్తేసింది. ఆ వెంటనే జేమ్స్ రాజీనామాను ఆమోదిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఈ ఏడాది జూలైలో కేఎస్ జేమ్స్‌ను సస్పెండ్ చేసిన సమయంలో ఆయనపై పలు ఆరోపణలు చేసింది. ఐఐపీఎస్‌లో అక్రమాలకు పాల్పడినట్లు 35 ఫిర్యాదులు అందాయని.. వాటిలో 11 ఆరోపణల్లో కేఎస్ జేమ్స్ నేరుగా అవినీతికి పాల్పడినట్లు తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తోంది. ఐఐపీఎస్‌లో అక్రమంగా రిక్రూట్‌మెంట్లు చేయడం, రిజర్వేషన్లకు సంబంధించి రోస్టర్లను పట్టించుకోక పోవడం, స్టాక్ రిజిస్టర్లు సరిగా నిర్వహించకపోవడం వంటి వాటిలో కేఎస్ జేమ్స్ ప్రధాన సూత్రధారిగా తేల్చింది. అయితే కేఎస్ జేమ్స్‌పై వచ్చిన ఫిర్యాదులు ఏమిటో మాత్రం చెప్పలేదు.
కాగా, కేఎస్ జేమ్స్‌పై తీసుకున్న చర్యలపై సహచర ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్‌లో పేర్కొన్న అంశాలపై కేంద్రానికి కోపం రావడం వల్లే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. దేశంలోని ప్రజలకు రక్తహీనత పెరగడం, ఉజ్వల స్కీమ్ వల్ల మహిళలకు ఎలాంటి ప్రయోజనం లేదని పేర్కొనడం, దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా 100 శాతం టాయిలెట్ల సౌకర్యం లేదని రిపోర్టులో చెప్పడం కేంద్రానికి ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రజల ఆరోగ్య స్థితిగతులపై ఇచ్చిన రిపోర్టు పాలకుల ఆగ్రహానికి కారణమయ్యింది.
దేశం వెలిగిపోతోందని ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రచారం చేసుకుంటుండగా.. ఐఐపీఎస్ డైరెక్టర్ హోదాలో కేఎస్ జేమ్స్ కీలకమైన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో అనేక నిజాలు వెల్లడించడం పాలక పెద్దలకు కొరుకుడు పడలేదు. ఈ రిపోర్టు 100 శాతం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అందుకే కేఎస్ జేమ్స్‌పై పలు అబద్దపు ఆరోపణలు పెట్టి తొలగించిందని సహచరులు చెబుతున్నారు. ప్రస్తుతం 6వ దశ సర్వే జరుగుతోందని.. జేమ్స్‌ను తొలగించడం ద్వారా కేంద్రం ప్రస్తుత సర్వేలో భాగస్వాములు అయిన వారికి కఠినమైన హెచ్చరికలు పంపినట్లు అయ్యిందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.