Telugu Global
National

సుప్రీం వైఖరి మింగుడుపడటంలేదా?

తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్‌లో చీఫ్ కమిషనర్, కమిషనర్ల నియామకం విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఉదాహరణ. ఇప్పటివరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల ఇష్టప్రకారమే చీఫ్ కమిషనర్, కమిషనర్లు అపాయింట్ అయ్యేవారు. ఈమధ్యనే కేంద్రం చేసిన కమిషన్ నియామకం అత్యంత వివాదాస్పదమైంది. ఆ వివాదం ఇప్పుడు కోర్టులో విచారణను ఎదుర్కొంటోంది.

సుప్రీం వైఖరి మింగుడుపడటంలేదా?
X

సుప్రీంకోర్టు వైఖరి నరేంద్రమోడీకి ఏమాత్రం మింగుడుపడుతున్నట్లు లేదు. సుప్రీంకోర్టు చొరవ మోడీకి పంటిలో రాయిలాగ తగులుతున్నట్లుంది. తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్‌లో చీఫ్ కమిషనర్, కమిషనర్ల నియామకం విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పే ఉదాహరణ. ఇప్పటివరకు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల ఇష్టప్రకారమే చీఫ్ కమిషనర్, కమిషనర్లు అపాయింట్ అయ్యేవారు. ఈమధ్యనే కేంద్రం చేసిన కమిషన్ నియామకం అత్యంత వివాదాస్పదమైంది. ఆ వివాదం ఇప్పుడు కోర్టులో విచారణను ఎదుర్కొంటోంది.

బహుశా ఈ వివాదాన్ని దృష్టిలో పెట్టుకునే ఏమో ఇక నుండి కేంద్రప్రభుత్వం ఇష్టప్రకారం చీఫ్ కమిషనర్, కమిషనర్లను నియమించేందుకు లేదని తేల్చిచెప్పింది. వీళ్ళ నియమకానికి కోర్టు కమిటీని నియమించింది. ప్రధానమంత్రి అధ్యక్షుడిగా ఉండే కమిటీలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సభ్యులుగా ఉంటారని చెప్పింది. నిజంగా ఈ ఆదేశం మోడీకి ఏమాత్రం రుచించనిదే. గతంలో సీబీఐ చీఫ్ నియామకంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి ఆదేశమే ఇచ్చి మోడీ చేతులు కట్టేసింది. అదానీ వివాదంపైన కూడా సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది.

మామూలుగా మోడీ వ్యవహార శైలి ఎలాగుంటుందంటే తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించకూడదన్నట్లుగా ఉంటుంది. ప్రతిపక్షాలకు, పార్లమెంటుకు మోడీ సమాధానం చెప్పటానికి ఇష్టపడరు. లాక్ డౌన్ విధించినా, పెద్ద నోట్లను రద్దుచేసినా మోడీ తనిష్టం వచ్చినట్లుగానే వ్యవహరించిన సంగతి దేశమంతా చూసింది. తన నిర్ణయాల వల్ల దేశం ఎంత ఇబ్బందులు పడినా మోడీ లెక్కచేయలేదు.

ఈ పద్ధ‌తిలోనే వ్యవసాయ చట్టాలను చేశారు. దాన్నిసుప్రీంకోర్టు అడ్డుకుంది. పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపైన కూడా మోడీకి ఇష్టంలేకపోయినా సుప్రీంకోర్టు చొరవతీసుకుని విచారణ మొదలుపెట్టింది. తాజాగా అదానీ వివాదంపై పార్లమెంటులోను, బయటా ఎంత గొడవ జరుగుతున్నా ఇంతవరకు మోడీ ఒక్క మాటకూడా మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకుని నిపుణులతో విచారణ మొదలుపెట్టింది. ఇక్కడే మోడీకి సుప్రీంకోర్టు వైఖరి మింగుడుపడటంలేదు. కానీ చేయగలిగేది ఏమీ లేదు కాబట్టే మాట్లాడకుండా అంగీకరిస్తున్నారు.

First Published:  3 March 2023 10:27 AM IST
Next Story