షిండే వర్గంలోకి ఠాక్రేలు.. శివసేన బ్రాండ్ కోసం కొత్త ఎత్తులు..
ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ మంత్రి వర్గంలోకి తీసుకుంటారట. తద్వారా ఠాక్రే వర్గాన్ని, ఆ కుటుంబ అభిమానుల్ని తన వర్గంవైపు తిప్పుకోవచ్చనేది షిండే ఆలోచన.
గతంలో శివసేన నుంచి బయటకొచ్చిన రాజ్ ఠాక్రే కొత్తగా నవనిర్మాణ సేన అనే పార్టీ పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు శివసేన నుంచి బయటకొచ్చిన ఏక్ నాథ్ షిండే మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల అండతో తనదే అసలైన శివసేన అంటున్నారు. కానీ బాల్ ఠాక్రే బ్రాండ్ లేని వర్గాన్ని శివసేన అనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదనే సమాచారంతో ఇప్పుడు ఠాక్రే వర్గాన్ని కూడా తనవైపు తిప్పుకోడానికి చూస్తున్నారు షిండే. కేవలం ఠాక్రే వారసత్వంతోనే ఉద్ధవ్ తనదే అసలైన శివసేన అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడా వారసత్వాన్ని, ఠాక్రే అనే పేరుని తనవైపు కూడా ఉండేలా చేసుకుంటున్నారు షిండే.
షిండే సేన వర్సెస్ ఠాక్రే సేన..
ఇటు షిండే, అటు ఉద్ధవ్.. ఇప్పుడు షిండే వర్గంలో కూడా ఠాక్రేలు వచ్చేస్తున్నారు. బాల్ ఠాక్రే మనవడు ఉద్ధవ్ ఠాక్రే అన్న కుమారుడు నిహార్ ఠాక్రే తాజాగా షిండే గ్రూపులో కలసిపోయారు. గతంలోనే నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రేతో షిండే మంతనాలు జరిపారు. రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ ఠాక్రేకి మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మరీ మంత్రి వర్గంలోకి తీసుకుంటారట. తద్వారా ఠాక్రే వర్గాన్ని, ఆ కుటుంబ అభిమానుల్ని తన వర్గంవైపు తిప్పుకోవచ్చనేది షిండే ఆలోచన.
ఉద్ధవ్ ఏకాకి అయిపోతారా..?
ఓ పద్ధతి ప్రకారం ఉద్ధవ్ ని ఏకాకిని చేసేందుకు ఏక్ నాథ్ షిండే ప్రయత్నాలు చేస్తున్నారు. బాల్ ఠాక్రే కి ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు బిందు మాధవ్ ఠాక్రే సినీ నిర్మాతగా ఉంటూ చనిపోయారు, ఆయన కొడుకు నిహార్ ఠాక్రే ఇప్పుడు షిండే వర్గంలోకి వచ్చారు. బాల్ ఠాక్రే మరో కొడుకు జయదేవ్ ఠాక్రే మాజీ భార్య స్మిత ఠాక్రే కూడా ఇటీవల సీఎం షిండేను కలిశారు. ఉద్ధవ్ మినహా మిగతా కుటుంబ సభ్యులెవరూ అప్పట్లో రాజకీయాల్లో ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు అలాంటి వారందరినీ షిండే ఒకే దగ్గరకు చేరుస్తున్నారు. ఉద్ధవ్ ని ఏకాకిగా మార్చేస్తున్నారు.