ఆ ఆరోపణలకు ఆధారాలుంటే నిరూపించాలి.. - 228 కిలోల బంగారం మాయం ప్రకటనపై ఆలయ చైర్మన్ సవాల్
కేదార్‌నాథ్ ఆలయంలో తాపడం చేసిన 228 కేజీల బంగారం అదృశ్యమైందని స్వామీ అవిముక్తేశ్వరానంద సోమవారం ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
కేదార్‌నాథ్ ఆలయంలో వందల కిలోల బంగారం మాయమైందంటూ స్వామీ అవిముక్తేశ్వరానంద చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ బుధవారం స్పందించారు. స్వామి అవిముక్తేశ్వరానంద చేసిన ప్రకటనలు దురదృష్టకరమని ఆయన చెప్పారు. కేదార్‌నాథ్ ఆలయంలో 228 కిలోల బంగారం మాయమైందంటూ ఆయన చేసిన ప్రకటనలను సవాల్ చేస్తున్నానని చెప్పారు. వాస్తవాలను ప్రపంచం ముందుంచాలన్నారు. స్వామీజీ ప్రకటనలు చేసే కంటే.. సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసి దర్యాప్తునకు డిమాండ్ చేయాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన వద్ద ఆధారాలు ఉంటే హైకోర్టు లేదా సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు.
అసలేం జరిగిందంటే..
కేదార్‌నాథ్ ఆలయంలో తాపడం చేసిన 228 కేజీల బంగారం అదృశ్యమైందని స్వామీ అవిముక్తేశ్వరానంద సోమవారం ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు. అక్కడ కుంభకోణం చేసి.. ఢిల్లీలో ఆలయ నమూనా నిర్మిస్తున్నారా అని ప్రశ్నించారు. బంగారం గోల్‌మాల్‌పై అసలు దర్యాప్తు ప్రారంభించలేదన్నారు. దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. దీనిపై తాము కమిషనర్‌ను విచారణకు డిమాండ్ చేసినా ఫలితం లేదన్నారు. తొలుత 320 కిలోల బంగారం మాయమైందన్నారని, తరవాత 228 కిలోలకు తగ్గించారని, ఆ తర్వాత 36..32.. 27 అన్నారని ఆయన చెప్పారు. బంగారం 320 కిలోలా.. 27 కిలోలా అన్నది సమస్య కాదని.. అది ఎక్కడికి పోయిందనేదే ముఖ్యమని తెలిపారు. బంగారం రాగిగా ఎలా మారుతుందని ఆయన నిలదీయడం గమనార్హం.
స్వామి అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యలపై బుధవారం స్పందించిన ఆలయ కమిటీ చైర్మన్ అజేంద్ర.. కేదార్‌నాథ్ ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించే హక్కు శంకరాచార్య స్వామీ అవిముక్తేశ్వరానందకు లేదని వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయ లక్ష్యాలతో పనిచేస్తే మాత్రం అది దురదృష్టకరమని చెప్పారు. కాంగ్రెస్ అజెండా ముందుకు తీసుకెళ్లేందుకు పనిచేయడం విచారకరమన్నారు. ఆయన కేవలం ఆందోళనలు, వివాదాలు సృష్టించడానికే ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు.