Telugu Global
National

ప్రజల నుండి వస్తున్న 'తెలంగాణ మోడల్' డిమాండ్ తో సతమతమవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ మోడల్ అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు లాతూర్ జిల్లాలో సామాజిక కార్యకర్త, వినాయక్ పాటిల్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.

ప్రజల నుండి వస్తున్న తెలంగాణ మోడల్ డిమాండ్ తో సతమతమవుతున్న మహారాష్ట్ర ప్రభుత్వం
X

మహారాష్ట్ర‌లోని బిజెపి-శివసేన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి నమూనాను అధ్యయనం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం కొందరు అధికారులకు బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్వయంగా చొరవ తీసుకొని అధికారులతో తెలంగాణ మోడల్ పై చర్చలు జరిపారని బోగట్టా.

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలో తాను నిర్వహించిన మూడు బహిరంగ సభల్లోనూ ఎత్తిచూపిన తెలంగాణ మోడల్‌ను అమలు చేయాలని పలు వర్గాల నుంచి డిమాండ్లు రావడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

నాందేడ్‌లో కేసీఆర్ మొదటి సమావేశం తర్వాత రైతులకు ఎకరాకు రూ. 6,000 ఇన్‌పుట్ సబ్సిడీని ఇస్తానని హడావిడి చేసిన షిండే, వివిధ వర్గాల నుండి మరిన్ని డిమాండ్ లు రావడం, ఆందోళనలు జరుగుతున్న‌ నేపథ్యంలో పలువురు నాయకులను షిండే చర్చలకు పిలిచినట్లు తెలిసింది.

తెలంగాణ మోడల్ అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు లాతూర్ జిల్లాలో సామాజిక కార్యకర్త, వినాయక్ పాటిల్ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. ఐదు రోజులుగా నిరాహార దీక్ష చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించింది.

కేసీఆర్ తరపున పాటిల్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే, మహారాష్ట్ర BRS నాయకుడు శంకర్ అన్నా ధోంగే తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు పాటిల్‌ను పిలిచి, అతని డిమాండ్లపై చర్చించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

“దీక్ష‌ విరమించమని నేను అతనిని ఒప్పించాను. అధికారంలో ఉన్నవారిలోనూ చిత్తశుద్ధి కనిపిస్తోంది. వారు అతనికి ఫోన్ కాల్ చేసి, అతని డిమాండ్‌పై చర్చించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు, ”అని ధోంగే చెప్పారు, తెలంగాణలో అమలు చేస్తున్న‌ పథకాలను అధ్యయనం చేయాలని అధికారులను ప్రభుత్వం ఇప్పటికే కోరినట్లు చెప్పారు.

“ముఖ్యమంత్రి షిండే కూడా వారాంతంలో పలువురు నాయకులతో పథకాల గురించి చర్చిస్తారు. అయితే ప్రజలు ఎదుర్కొంటున్న క్లిష్ట సమస్యల పట్ల పాలకులు అనుసరిస్తున్న తీరుపై రాష్ట్రంలోని యువత తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు స్పందించడంలో పాలకులు విఫలమయ్యారు. అందుకే వారిని వదిలించుకోవడానికి ప్రజలు సిద్దమయ్యారు, ”అని ఆయన అన్నారు.

ఔరంగాబాద్‌లో జరిగిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలతి (వీఆర్‌ఏ) వ్యవస్థను రద్దు చేసిందని, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అలాగే చేయాలని కోరారు. దాంతో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థను రద్దు చేయడానికి ఇప్పటికే చర్చలు కూడా ప్రారంభించినట్టు సమాచారం.

''మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఇప్పటికీ జరుగుతునే ఉన్నాయి. అంతకుముందు విదర్భ తర్వాత తెలంగాణలో అత్యధికంగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. కానీ రైతు బంధు, నిరంతర విద్యుత్ సరఫరా, కాళేశ్వరం ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణ వంటివన్నీ తెలంగాణ రైతులకు వ్యవసాయం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చేశాయి. ఈ ప్రయోజనాలన్నీ మహారాష్ట్రలోని రైతులకు అందడం లేదు. ”అని ఆయన అన్నారు, BRS ప్రభావం తెలంగాణతో సరిహద్దును పంచుకునే ఒక్క విదర్భ ప్రాంతానికి పరిమితం కాదు, గుజరాత్‌కు దగ్గరగా ఉన్న జిల్లాలలో కూడా ఉందన్నారు అన్నా ధోంగే.

హైదరాబాద్‌లో పనిచేస్తున్న మహారాష్ట్రకు చెందిన ఐటీ రంగ ఉద్యోగులు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన అభివృద్ధి నమూనా గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. వారు రెండు రాష్ట్రాల్లోని నాయకత్వాల మధ్య పోలికలు చెప్తున్నారు. వాస్తవానికి, ఈ యువతే మహారాష్ట్రలో BRS ప్రధాన ప్రచారకులయ్యారు అని ధోంగే చెప్పారు.

షెట్కారీ సంఘటన యూత్ ప్రెసిడెంట్ సుధీర్ సుధాకరరావు బిందు మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ రాక మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలను కుదిపివేసిందని, అయితే పార్టీ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని అన్నారు.

మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ నాయకుడు మాణిక్‌ కదమ్‌ అన్నారు. మహారాష్ట్రలో వ్యవసాయం అంతగా లాభసాటిగా లేని దుర్భర పరిస్థితుల కారణంగా తాజాగా కనీసం 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ తరహాలో రైతు సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కూడిన దృక్పథం లేకుండా పోయిందన్నారు.

First Published:  8 May 2023 10:11 AM IST
Next Story