Telugu Global
National

నా కోటు, నా నోటు.. రెండూ తెలుపే

డాక్టర్ గా తాను ధరించే కోటు తెలుపని, తన వద్ద ఉన్న నోట్లు కూడా బ్లాక్ మనీ కాదనే అర్థం వచ్చేలా తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు.

నా కోటు, నా నోటు.. రెండూ తెలుపే
X

2వేల రూపాయల నోట్లు వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన వెంటనే.. దేశవ్యాప్తంగా రకరకాల సెటైర్లు మొదలయ్యాయి. మోదీని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ముందు ముందు ఇంకేం రద్దు చేస్తారో అంటూ కామెడీ చేస్తున్నారు. ఆ సలహా తనదేనంటూ చంద్రబాబు లాంటి నేతలు ఇంకాస్త కామెడీ సృష్టిస్తున్నారు. బీజేపీ వైరి వర్గాలు మరింత ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నాయి. బీజేపీ నేతలకు మింగలేక, కక్కలేక అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ దశలో తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. 2వేల నోటు రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నా కోటు, నా నోటు రెండూ తెలుపే'నన్నారామె.

‘నేను వేసుకునే కోటు, నా దగ్గరున్న నోటు.. రెండూ తెలుపే. అందుకే 2 వేల రూపాయల నోట్ల చెలామణీ రద్దయినా నాకు బాధలేదు’ అంటూ చమత్కరించారు తమిళిసై. 2వేల నోటు రద్దు తర్వాత ఆ వ్యవహారాన్ని సమర్థించుకోడానికి బీజేపీ కిందామీదా పడుతోంది. అసలు పేదల వద్ద 2వేల నోట్లు లేనే లేవని అందుకే వారు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదంటున్నారు. పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో 2వేల నకిలీ నోట్లు తయారు చేసి భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టడానికి సిద్ధపడుతున్న వేళ, మోదీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఇదని మరో వర్గం డబ్బా కొడుతోంది. ఈ దశలో గవర్నర్ తమిళీ సై కూడా స్వామిభక్తి చాటుకోవాలనుకున్నారు. తన దగ్గర 2వేల నోట్లు లేవని చెప్పే ప్రయత్నం చేశారు.

డాక్టర్ గా తాను ధరించే కోటు తెలుపని, తన వద్ద ఉన్న నోట్లు కూడా బ్లాక్ మనీ కాదనే అర్థం వచ్చేలా తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. పుదుచ్చేరిలో ఓ ప్రైవేటు కాలేజీ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె నోట్ల రద్దుపై ఇలా స్పందించారు. పుదుచ్చేరికి సంబంధించి తనకు ముఖ్యమంత్రికి ఎలాంటి మనస్పర్థలు లేవన్నారు. సీఎంకు, తనకు మధ్య విబేధాలు చోటుచేసుకోవాలని మాజీ సీఎం నారాయణాస్వామి ఆశ పడుతున్నారని కౌంటర్ ఇచ్చారు గవర్నర్ తమిళిసై.

First Published:  21 May 2023 9:22 AM IST
Next Story