కేంద్రమంత్రి పదవి జస్ట్ మిస్సయ్యా.. నా టాలెంట్ ని మీరు గుర్తించలేదు
తన ఓటమికి కారణం ప్రజలు తన టాలెంట్ ని గుర్తించలేకపోవడమేనంటున్నారు తమిళిసై. అందుకే కేంద్రం తన ప్రతిభ గుర్తించిందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన టాలెంట్ ని తమిళ ప్రజలు గుర్తించలేదని, లేకపోతే తాను పార్లమెంట్ కి వెళ్లేదాన్ని అని, కేంద్రమంత్రిని కూడా అయిఉండేదాన్ని అని చెప్పారు. తన ప్రతిభని ప్రజలు గుర్తించలేదు కాబట్టి, ఆ టాలెంట్ వృథా కాకూడదనే ఉద్దేశంతోనే కేంద్రం గవర్నర్ గా నియమించిందని అన్నారామె. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన స్టాఫ్ డే సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
4సార్లు ఓటమి..
తమిళిసై సౌందర్ రాజన్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి ఆనందన్ కాంగ్రెస్ తరపున లోక్ సభ సభ్యుడిగా పనిచేశారు. కుటుంబానికి కాంగ్రెస్ నేపథ్యం ఉన్నా కూడా తమిళిసై మాత్రం బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చారు. అంచెలంచలుగా ఎదిగి తమిళనాడు బీజేపీ పగ్గాలు చేపట్టారు. అయితే ఆమెకు ప్రత్యక్ష రాజకీయాలు ఏమాత్రం కలసి రాలేదు. రెండుసార్లు అసెంబ్లీకి, రెండు సార్లు లోక్ సభకు పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. మొత్తం నాలుగుసార్లు దండయాత్రలు చేసినా ఫలితం లేకపోవడంతో ఆమెను కేంద్రం గవర్నర్ గా పంపించింది. తెలంగాణకు గవర్నర్ గా చేస్తున్న సమయంలోనే పుదుచ్చేరి అదనపు బాధ్యతలు అప్పగించారు. తన ఓటమికి కారణం ప్రజలు తన టాలెంట్ ని గుర్తించలేకపోవడమేనంటున్నారు తమిళిసై. అందుకే కేంద్రం తన ప్రతిభ గుర్తించిందని చెప్పుకొచ్చారు.
నేను పడిపోతేనే వార్త..
ఇటీవల ఓ కార్యక్రమంలో కార్పెట్ పై నడుచుకుంటూ వెళ్తున్న తమిళిసై ఉన్నట్టుండి ముందుకి పడిపోయారు. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై కూడా ఆమె తనదైన శైలిలో కామెంట్ చేశారు. తాను రెండు రాష్ట్రాల విధి నిర్వహణలో కిందామీదా పడుతుంటే ఎక్కడా వార్తలు రాలేదని, కానీ కిందపడితే మాత్రం అదే వార్తను పదే పదే చూపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు తమిళిసై. తనకు రెండు ఫోన్లు ఉంటాయని, ఈ కార్యక్రమానికి వచ్చే సమయంలో ఓ పెద్దాయన తన వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్లను చూసి, ఎలా భరిస్తున్నారని ప్రశ్నించారని, తాను రెండు రాష్ట్రాలనే పర్యవేక్షిస్తున్నప్పుడు.. ఈ రెండు ఫోన్లను భరించలేనా? అని సమాధానం ఇచ్చానని వివరించారు తమిళిసై.