ఢిల్లీలో కేసీఆర్.. మూడురోజులు మకాం..
పార్లమెంట్ సమావేశాల కోసం ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. మూడురోజులపాటు ఢిల్లీలోనే ఉండబోతున్న కేసీఆర్ పలువురు కీలక నేతలతో సమావేశమయ్యే అవకాశముంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఇవాళ్టినుంచి మూడురోజులపాటు ఆయన అక్కడే ఉంటారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో తొలిరోజు నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలసి శుభాకాంక్షలు తెలుపుతారు. అనంతరం కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో వేర్వేరుగా భేటీ అవుతారని తెలుస్తోంది. తెలంగాణ వరదలు, ఎన్డీఆర్ఎఫ్ వరద సాయం, తదితర అంశాలపై కేంద్ర మంత్రులకు సీఎం కేసీఆర్ వివరించే అవకాశముంది. రాష్ట్రం నుంచి వరదసాయంపై నివేదికలు పంపినా కేంద్రం నుంచి సమాధానం లేదు. ఈ విషయం మరోసారి కేంద్రానికి గుర్తు చేయడంతోపాటు, వరద నష్టాలపై సమగ్ర సమాచారం అందిస్తారని తెలుస్తోంది.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ఆసక్తి రేకెత్తిస్తోంది. జాతీయ పార్టీ విషయంలో ఈ పర్యటనతో మరింత క్లారిటీ వచ్చే అవకాశముందని అంటున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. మూడురోజులపాటు ఢిల్లీలోనే ఉండబోతున్న కేసీఆర్ పలువురు కీలక నేతలతో సమావేశమయ్యే అవకాశముంది. పార్లమెంట్ లో ప్రతిపక్షాలన్నీ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపడుతున్నాయి. ఈ దశలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఆయన దిశానిర్దేశం చేసే అవకాశముంది. అదే సమయంలో జాతీయ పార్టీ ఏర్పాటు, విధి విధానాలపై కూడా కేసీఆర్ ఇతర పార్టీల ముఖ్య నేతలతో కీలక చర్చలు జరిపే అవకాశముందని అంటున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలన్నీ యశ్వంత్ సిన్హాకు మద్దతిచ్చాయి. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థి మార్గరెట్ ఆల్వాకు మద్దతిచ్చే విషయంలో ఏకాభిప్రాయం లేదు. విపక్ష పార్టీలేవీ ఆమెకు అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఓటు ఎవరికి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ పర్యటనలో దీనిపై క్లారిటీ వస్తుందని అంటున్నారు. మరోవైపు ఢిల్లీలోనే ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై వరద ప్రాంతాల పరామర్శలపై హాట్ కామెంట్లు చేశారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.