ఆర్భాటాలు వద్దు.. సహచర మంత్రులకు తేజస్వి యాదవ్ సూచన
నమస్తే, ఆలింగనంతో ప్రజలను పలకరించాలని తమ పార్టీ నుంచి మంత్రులైనవారికి సూచనలు చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇటీవల బిహార్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తేజస్వి యాదవ్ తన సహచర మంత్రులకు కీలక సూచనలు చేశారు. 'రాష్ట్రీయ జనతాదళ్ నుంచి ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందిన వారెవరూ.. కొత్త వాహనాల కోసం దరఖాస్తు చేసుకోవద్దు. కార్యకర్తలు, అనుచరుల నుంచి బహుమతులు స్వీకరించొద్దు. అత్యవసరమైతే పెన్నులు, పుస్తకాలు మాత్రమే స్వీకరించాలి. వాటిని పేద విద్యార్థులకు పంపిణీ చేయాలి. తమకంటే వయసులో పెద్దవారైన వాళ్లు కాళ్ల మీద పడటం వంటి కార్యక్రమాలను నిరోధించాలి.' అంటూ ఆయన తమ పార్టీ నుంచి మంత్రులైనవారికి సూచనలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నమస్తే, ఆలింగనంతో ప్రజలను పలకరించాలని సూచించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ .. బీజేపీతో పొత్తును వదులుకొని.. ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ నెల 24న నూతన ప్రభుత్వం బిహార్ అసెంబ్లీలో మెజారిటీని నిరూపించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం తేజస్వి యాదవ్ సూచనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.