Telugu Global
National

ఒక్క ఓటరు, బీజేపీకి 8 ఓట్లు.. ఈసీ రియాక్షన్ ఏంటి..?

భారత్ లో ఎన్నికలు అతిపెద్ద జోక్ గా మారిపోయాయని అన్నారు కేటీఆర్. బీజేపీకి పడిన దొంగఓట్ల వీడియోని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఒక్క ఓటరు, బీజేపీకి 8 ఓట్లు.. ఈసీ రియాక్షన్ ఏంటి..?
X

ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లడం నిషేధం. ఒకవేళ తీసుకెళ్లినా ఓటింగ్ ప్రక్రియను వీడియో తీయకూడదు. ఇక దొంగ ఓట్లు వేయడమనేది మరీ పెద్ద నేరం. కానీ ఇక్కడో యువకుడు బీజేపీకి దొంగ ఓట్లు వేస్తూ ఏకంగా వీడియో తీసుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఆ వీడియోని సోషల్ మీడియాలో పబ్లిష్ చేశాడు. ఇంకే ముంది ఈ వ్యవహారం వైరల్ గా మారింది. ఇటీవల మరికొంతమంది కూడా ఇలా ఓటు వేస్తూ వీడియోలు తీసుకున్న ఉదాహరణలున్నాయి. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రతిపక్షాలు కూడా ఈ వీడియోని హైలైట్ చేస్తూ ఎన్నికల కమిషన్ ని ట్యాగ్ చేస్తున్నాయి.


బీజేపీకి దొంగ ఓట్లు..

ఈవీఎంలను మేనేజ్ చేస్తోందంటూ బీజేపీపై ఇప్పటికే ఆరోపణలున్నాయి. తాజాగా ఈవీఎంలో దొంగఓట్లు కూడా బీజేపీకే పడ్డాయి. రెండూ మూడు కాదు, ఏకంగా 8 ఓట్లు వేశాడు సదరు యువకుడు. ఉత్తరప్రదేశ్ లోని ఫరూఖాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ రాజ్‌పుత్ కు ఓ యువకుడు 8 సార్లు ఓటు వేస్తూ వీడియో రికార్డ్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సదరు యువకుడిపై చర్యలు తీసుకోవాలని, ఆ అభ్యర్థిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినపడుతున్నాయి. ఓటు వేసిన యువకుడు రజన్ సింగ్ ఠాకూర్ అని, అతడి తండ్రి బీజేపీ నేత అనిల్ సింగ్ అని తెలుస్తోంది. అయితే తన కొడుకు దొంగ ఓట్లు వేయలేదని, ఈవీఎం పనితీరు పరిశీలించే క్రమంలో తీసిన వీడియో అది అని అంటున్నారు అనిల్ సింగ్. ఆ వీడియోని ఎడిట్ చేసి కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన.

కేటీఆర్ ఘాటు ట్వీట్..

భారత్ లో ఎన్నికలు అతిపెద్ద జోక్ గా మారిపోయాయని అన్నారు కేటీఆర్. బీజేపీకి పడిన దొంగఓట్ల వీడియోని ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఎన్నికల కమిషన్ ని సూటిగా ప్రశ్నించారు. ఇప్పుడేమైనా చెప్పడానికి ఉందా..? అని అడిగారు. ఇలాంటి దొంగ ఓట్లతోనే బీజేపీ 400 సీట్లు పక్కా అని చెప్పుకుంటోందని నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.



First Published:  19 May 2024 9:28 PM IST
Next Story