Telugu Global
National

బీసీసీఐ అధ్యక్షుడి రేసులో కొత్త వ్యక్తి.. అమిత్ షా ఒప్పుకుంటేనే.!

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

బీసీసీఐ అధ్యక్షుడి రేసులో కొత్త వ్యక్తి.. అమిత్ షా ఒప్పుకుంటేనే.!
X

ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ పాలకవర్గ ఎన్నికలు ఈ నెల 18న జరుగనున్నాయి. ఆ రోజు జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్త అధ్యక్షుడు, కార్యదర్శి, ఉపాధ్యక్షుడు, సంయుక్త కార్యదర్శి, కోశాధికారిని ఎన్నుకోనున్నారు. ఈ నెల 11, 12 తేదీల్లో నామినేషన్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. కాగా, ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి ఆ పదవిలో కొనసాగడానికి ఆసక్తి చూపించడం లేదని తెలుస్తున్నది. దీంతో అందరూ ప్రస్తుత కార్యదర్శి జై షా.. బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉంటారని భావించారు. కానీ తాజగా మరో పేరు అధ్యక్ష పదవి రేసులోకి వచ్చింది.

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్, 1983లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాజాగా బీసీసీఐ విడుదల చేసిన ఎలక్టోరల్ డ్రాఫ్ట్‌లో బిన్నీ పేరు ఉండటం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. బీసీసీఐ సర్వ సభ్య సమావేశానికి ప్రతీ రాష్ట్ర అసోసియేషన్ నుంచి ఒకరి పేరును ఇవ్వాల్సి ఉంటుంది. అలా పేర్లు ఉన్న వ్యక్తులే బీసీసీఐ ఎన్నికల్లో పోటీ పడతారు. వాస్తవానికి కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) కార్యదర్శి సంతోష్ మీనన్ పేరు జాబితాలో ఉండాలి. గతంలో బీసీసీఐ ఏజీఎం జరిగిన సమయంలో కూడా ఆయనే పాల్గొన్నారు. కానీ అనూహ్యం మీనన్ ప్లేసులో రోజర్ బిన్ని కేఎస్‌సీఏ ప్రతినిధిగా ఏజీఎంలో పాల్గొననున్నట్లు జాబితాలోపేర్కొన్నారు.

బీసీసీఐ అధ్యక్షుడి రేసులో రోజర్ బిన్ని ముందున్నాడని బోర్డు వర్గాలు అంటున్నాయి. జై షా కార్యదర్శిగానే కొనసాగడానికి ఆసక్తి చూపిస్తుండగా, గంగూలీ మాత్రం ఐసీసీకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రస్తుత ఆఫీస్ బేరర్లతో పాటు, గతంలో పని చేసిన వారితో ఓ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. బోర్డు పాలకమండలిలో ఎవరెవరు ఉండాలనే విషయాలను అక్కడ చర్చించినట్లు తెలుస్తున్నది. చాలా మంది బిన్నీ వైపు మొగ్గు చూపినట్లు కూడా సమాచారం.

కాగా, బీసీసీఐపై కేంద్ర మంత్రి అమిత్ షా పెత్తనం మరోసారి కనపడుతోంది. ఇప్పటికే కొడుకుకు కీలకమైన కార్యదర్శి పదవిని కట్టబెట్టడంలో ఆయన సఫలం అయ్యారు. సుప్రీంకోర్టులో బీసీసీఐకి వ్యతిరేకంగా ఉన్న కేసును అనుకూలంగా మార్చడంలో అమిత్ షా పాత్ర ఉన్నట్లు వ్యాఖ్యలు వినిపించాయి. ఇప్పుడు కూడా కొత్త పాలకమండలిలో ఎవరెవరు ఉండాలనే విషయాన్ని ఆయనే నిర్ణయిస్తారని, ఆయన చెప్పినట్లే బోర్డు నడుచుకుంటుందని బీసీసీఐ వర్గాలు వ్యాఖ్యానించాయి.

First Published:  8 Oct 2022 8:42 AM IST
Next Story