ఒకేసారి రెండు ఉద్యోగాలు.. కంపెనీలు జాలి చూపిస్తాయా..?
మూన్ లైటింగ్ విషయంలో ఉద్యోగుల్లో భయం ఉంటే చాలని, వారి జీవితాలు నాశనం కానవసరం లేదనేది కొన్ని యాజమాన్యాల వాదన. చిన్నవయసులోని వారికి పెద్ద శిక్ష వేయలేమంటోంది టీసీఎస్.
ఒక ఉద్యోగి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయొచ్చా, గతంలో పార్ట్ టైమ్ అంటున్నారు, ఇప్పుడు ఫుల్ టైమ్ రెండు ఉద్యోగాలు చేస్తున్నవారు చాలామందే ఉన్నారు. కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా పాపులర్ అయిందో, మూన్ లైటింగ్ (ఒకటికంటే ఎక్కువ ఉద్యోగాలు చేయడం) కూడా అలాగే పాపులర్ అయింది. అయితే కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాయి.
మూన్ లైటింగ్ చేస్తున్న 300మంది ఉద్యోగులను ఇటీవల విప్రో తొలగించిన సంగతి తెలిసిందే. ఇలా ఉద్యోగాలు చేయడం సరికాదని, అది తమ నిబంధనలకు విరుద్ధం అని తేల్చి చెప్పింది విప్రో. తమ సంస్థలో ఇలాంటి అవకాశం ఎవరికీ లేదన్నారు ఉన్నతాధికారులు. తమ క్లయింట్‌ల సమాచార గోప్యతకు ఇది భంగం కలిగిస్తుందని చెప్పారు. అయితే అన్ని కంపెనీలు ఒకేలా స్పందించడంలేదు. తాజాగా టీసీఎస్ సంస్థ మూన్ లైటింగ్ పై భిన్నంగా స్పందించింది. మూన్ లైటింగ్ చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం అంటే వారి ఉద్యోగ జీవితాన్ని నాశనం చేయడమేనని అంటున్నారు టీసీఎస్ సీఈఓ గణపతి సుబ్రమణియన్. అలాంటి వారి పట్ల కంపెనీలు కొంత ఉదారంగా ఉండాలన్నారు.
తప్పే కానీ..
మూన్ లైటింగ్ వల్ల కొన్ని కంపెనీల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశముంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు దీన్ని సీరియస్ గా పరిగణిస్తున్నాయి. అయితే మూన్ లైటింగ్ జరక్కుండా చూసుకోవాలని, ఒకవేళ జరిగితే మాత్రం వారిని ఉద్యోగాలనుంచి తొలగించకుండా హెచ్చరించి వదిలేయాలని అంటున్నారు టీసీఎస్ సీఈఓ.
రెండు ఉద్యోగాలు చేసేవారిని ఉద్యోగాలనుంచి తొలగించేందుకు కంపెనీలకు పూర్తి అధికారాలు ఉంటాయని, కానీ ఇప్పుడిపుడే కెరీర్ మొదలు పెడుతున్న యువత విషయంలో ఇలాంటి చర్యలు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు రాని పరిస్థితి ఎదురైతే అది మరింత ప్రమాదకరం అని చెబుతున్నారు. అందుకే వారిపై కాస్త జాలి చూపించాలని చెబుతున్నారు టీసీఎస్ సీఈవో. చిన్న వయస్సులో వారికి పెద్ద శిక్ష వేయాలని తాము అనుకోవడం లేదని తెలిపారు. అంటే మూన్ లైటింగ్ విషయంలో ఉద్యోగుల్లో భయం ఉంటే చాలని, వారి జీవితాలు నాశనం కానవసరం లేదనేది కొన్ని యాజమాన్యాల వాదన. మరి ఐటీలో దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంతమేర ఉంటుందనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పద్ధతి పూర్తి స్థాయిలో మొదలయ్యాక తేలిపోతుంది.