Telugu Global
National

తమిళులు హిందువులుకారా ? -ట్విట్టర్ లో సాగుతున్న యుద్దం

'తమిళులు హిందువులు కారు' అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళులు హిందువులు కాదంటూ వేలాది ట్వీట్లు చేస్తున్నారు తమిళులు.

తమిళులు హిందువులుకారా ? -ట్విట్టర్ లో సాగుతున్న యుద్దం
X

చోళ రాజుల కథతో తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ట్విట్టర్ లో తమిళులు హిందువులా కాదా అనే చర్చకు దారి తీశాయి. సోషల్ మీడియాలో రెండు భావజాలాల వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి యుద్దం చేసుకుంటున్నారు.

ఇంతకీ తమిళ దర్శకుడు వెట్రిమారన్ ఏమన్నారంటే.. '' మన మూలాలను మన నుంచి లాగేసుకుంటూనే ఉన్నారు. వళ్లువార్‌కు కాషాయ రంగు పులమడం, రాజరాజ చోళన్‌ను హిందూ రాజుగా చెప్పడం.. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి''. ఇవీ వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాట దుమారానికి కారణమయ్యింది. సోషల్ మీడియాలో వెట్రిమారన్ కుమద్దతుగా పెద్ద ఎత్త్తున తమిళులు ట్వీట్లు చేస్తున్నారు. అసలు. రాజరాజ చోళన్ మాత్రమే కాదు అసలు తమిళులెవరూ హిందువులు కాదని చాలామంది వాదిస్తున్నారు.

ప్రముఖ నటుడు కమల్‌హాసన్ కూడా వెట్రిమారన్ వ్యాఖ్యలను సమర్థించారు. రాజరాజ చోళన్ అసలు హిందూ రాజే కాదని, హిందూ అనేది బ్రిటీషర్లు సృష్టించిన భావన అని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు.

ఇక నెటిజనుల వాదనలైతే సంఘీయులకు విపరీతమైన ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

ట్విట్టర్ లో అనేక‌ మంది నెటిజనులు #TamilsAreNotHindus తమిళులు హిందువులు కారు అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టులు పెడుతున్నారు. అందులో కొన్నింటిని చూద్దాం...

''మాకు ప్రత్యేక పూజలు, ప్రత్యేక సంప్రదాయం, సంస్కృతి ఉన్నాయి. తమిళులు తమ పూర్వీకులను ఆరాధిస్తారు. తమిళ దేవుళ్ళు ఎక్కువగా, గతంలో జీవించిన ధైర్యవంతులైన మనుషులే. సూపర్ పవర్స్ కాదు.'' : డాక్టర్ దీపక్ | సుదారవణ్

''మీ వేదం మనుషుల మధ్య భేదాలను బోధిస్తుంది..

మా వేదం ప్రజల సమానత్వాన్ని బోధిస్తుంది

మేము మీలా ఉండము బ్రో'': డాక్టర్ దీపక్ | సుదారవణ్

''మేము తమిళులం, హిందువులం కాదు. మేము మా స్వంత సంస్కృతితో 10,000 సంవత్సరాలకు పైగా జీవిస్తున్న జాతి మాది. మా మతం తమిళ మతం. ప్రపంచంలో అందరికంటే మేము అత్యంత నాగరికత కలిగి ఉన్నాము.'':విఘ్నేసు చంద్రశేఖర్

''హిందూమతం అంటే సంస్కృతం, బ్రాహ్మణిజం, వర్ణ వ్యవస్థ, ఉన్నత కులం, అధమ కులం, మనుస్మృతి, వేదాలు, అంటరానితనం, అణచివేత, వీటన్నింటినీ అంగీకరించడం. మేము ఆ కోవలోకి రాకూడదనుకుంటున్నాము'': డాక్టర్ దీపక్ | సుదారవణ్

''ఇది తమిళనాడు - తమిళుల నేల! ఇది మహాబలవంతుడైన రావణుని భూమి! మీ రామపురాణాన్ని మా భూమి నుండి దూరంగా ఉంచండి! ఇక్కడ రాముణ్ణి అంగీకరించము! ఇది రావణ భూమి! కాబట్టి, సంఘీస్ గెటవుట్!'' : NTK‍సెంతమంగళం

''తమిళులు ఎప్పుడూ హిందువులు కాదు, ఎప్పటికీ హిందువులు కాలేరు. మేము గర్వించదగిన శైవులం, వైష్ణవులం.'': సునందా తమరై సెల్వన్

''తేవేరం, తిరువాసగం, పెరియపురాణం.. ప్రియమైన సంఘీస్, తమిళుల మత గ్రంథాల్లో ఎక్కడికైనా వెళ్లి వెతకండి. ఒక్క దగ్గర కూడా కూడా "హిందూ" అనే పదాన్ని కనుగొనలేరు.'':NTK‍ గుమ్మిడిపోండి

''చోళులు శివుడి అనుచరులు.వారి మతం శైవం.

వారి పవిత్ర భాష తమిళం. సంస్కృతం కాదు.

తమిళులు హిందువులు కాదు '': ఎస్ ఏ రావణన్

''తమిళులు హిందూ రాష్ట్రంలో భాగం కాదు. తమిళులు ఈ ఉపఖండంలోని అసలైన దేశీయ జాతి సమూహం. ఆర్యులు తమిళుల సంస్కృతిని, సంపదను ఆక్రమించి దోచుకున్నారు అతి ప్రాచీన భాష, వారసత్వాన్ని నాశనం చేశారు.'':NTK‍ చెంగల్పట్టు

ఇలా వందల మంది నెటిజనులు తమిళులు హిందువులు కాదంటూ ట్విట్టర్ లో మెసేజులు పెడుతూ ఉంటే బీజేపీ నాయకులు మండి పోతున్నారు. కొందరు నెటిజనులు కూడా తమిళులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళంతా హిందూ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

''చరిత్ర గురించి వెట్రిమారన్‌కు తెలిసినంత నాకు తెలియదు. కానీ.. అతనికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. రాజరాజచోళన్ రెండు చర్చ్‌లు, మసీదు కట్టించారు. తనను తాను శివపాద శేఖరన్ అని చెప్పుకొనే వారు. అలాంటప్పుడు రాజరాజచోళన్ హిందువు ఎందుకు కాదు..?'' అని తమిళనాడు బీజేపీ నేత హెచ్.రాజా ప్రశ్నించారు.

అయితే తమిళనాడులో ఇలాంటి చర్చ జరగడం ఇది కొత్త కాదు. ఆర్యులను, బ్రాహ్మణిజాన్ని, హిందూయిజాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాట అతి పెద్ద ద్రవిడ ఉద్యమం నడిచింది. పెరియార్ నాయకత్వంలో సాగిన భావజాల యుద్దం తమిళనాడుపై చాలా పెద్ద ప్రభావమే చూపించింది. ఆ భావజాలంతో రాజకీయ పార్టీలు ఏర్పడి అధికారంలోకి కూడా వచ్చాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న డీఎంకే అదే భావజాలంతో పుట్టిన పార్టీ.

First Published:  6 Oct 2022 7:40 PM IST
Next Story