వంట గ్యాస్ సెగ.. నిర్మలమ్మకు కాస్త గట్టిగానే తగిలింది
మన దేశంలో వంట గ్యాస్ లేదని, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అంతర్జాతీయ మార్కెట్ కి అనుగుణంగా ధరలు పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అక్కడ ధరలు తగ్గితే ఇక్కడా తగ్గుతాయన్నారు.
ప్రతిపక్షంలో ఉండగా గ్యాస్ సిలిండర్లను రోడ్లపైకి తెచ్చి బీజేపీ నేతలు ఎంత హడావిడి చేశారో అందరికీ తెలుసు. సిలిండర్ రేటుని 5, నుంచి 10 రూపాయలు పెంచినా గగ్గోలు పెట్టేవారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒకేసారి 50రూపాయలు పెంచడం ఆనవాయితీగా మారింది. కానీ అడిగేవారే లేరు, అడిగితే.. నీది ఏ మతం, నీకు ఏ దేశం సపోర్ట్ చేస్తోంది అనే ఎదురు ప్రశ్నలు విపడతాయి. సోషల్ మీడియాలో ఎన్ని కవరింగ్ లు చేసినా.. ప్రజల మధ్యకు వస్తే మాత్రం బీజేపీ నేతలకు చుక్కలు కనపడుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తమిళనాడులో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.
గ్యాస్ సిలిండర్ కొనలేకపోతున్నామమ్మా, మళ్లీ కట్టెలపొయ్యే దిక్కైంది అంటూ తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పజైఅసీవరం గ్రామ మహిళలు నిర్మలా సీతారామన్ ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని ఎంక్వయిరీ చేయాలనుకున్న ఆమెకు గ్యాస్ సిలిండర్ల రేట్లపై ప్రశ్నల వర్షం ఎదురైంది. కేంద్రం తీరుపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న వంటగ్యాస్ ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
మా చేతుల్లో ఏముంది..?
వంటగ్యాస్ ధరలను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ వారికి వివరించారు. మన దేశంలో వంట గ్యాస్ లేదని, మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, అంతర్జాతీయ మార్కెట్ కి అనుగుణంగా ధరలు పెంచుతున్నామని చెప్పుకొచ్చారు. అక్కడ తగ్గితే ఇక్కడా తగ్గుతాయన్నారు. అక్కడ పెరిగితే ఇక్కడ కూడా పెంచాలన్నారు. నిర్మలమ్మ సమాధానంతో అక్కడి మహిళలు సంతృప్తి చెందలేదు. మరి ప్రభుత్వం ఉన్నది ఎందుకనే అనుమానం వారిలో అలాగే ఉంది.
కట్టుకథ..
విచిత్రం ఏంటంటే.. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో గ్యాస్, పెట్రోల్ రేట్లు పెరిగినప్పుడు భారత్ లో కూడా పెరిగాయి, అక్కడ తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ తగ్గించలేదు. వినియోగదారులపై భారాన్ని అలానే ఉంచారు. ఆ ప్రతిఫలాన్ని కేంద్రం జేబులో వేసుకుంది. ఇప్పుడు నిర్మలమ్మ గ్రామీణ మహిళలకు పెద్ద కట్టుకథ వినిపించారు.