గవర్నర్లకు నోరుంది, చెవులు లేవు – స్టాలిన్
కేవలం తమిళనాడు గవర్నర్ ఒక్కరే కాదు, తెలంగాణ గవర్నర్ తమిళిసై ది కూడా ఇదే తీరు, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన జగదీప్ ధన్ ఖడ్ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేవారు.
బీజేపీ నియమిత గవర్నర్లకు నోరు తప్ప చెవులు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కేవలం తమిళనాడు మాత్రమే కాదని, చాలా రాష్ట్రాల గవర్నర్లకి మాట్లాడడానికి నోరు మాత్రమే ఉందన్నారు. వారు రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేది వినడం లేదని, వారికి చెవులు లేవని వ్యంగ్యస్త్రాలు విసిరారు. అందుకే గవర్నర్లందరూ ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వింటున్నారని వ్యాఖ్యానించారు.
ఆన్ లైన్ జూదాన్ని నిషేధిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆమోదించిన బిల్లుని గవర్నర్ ఆర్‌ఎన్ రవి వెనక్కి తిప్పి పంపిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వానికి గవర్నర్ కి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఒక్క బిల్లే కాదు, గతంలో పంపించిన బిల్లుల్ని కూడా గవర్నర్ ఆమోదించకుండా తొక్కిపెట్టారు. ఆన్ లైన్ జూద నిషేధ బిల్లుని మాత్రం వెనక్కి తిప్పి పంపారు. దీనిపై సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రపతికి ఫిర్యాదు కూడా చేశారు.
ఉంగలిల్ ఒరువన్ అనే కార్యక్రమంలో పాల్గొన్న స్టాలిన్ ప్రజలు వేసే ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోకూడదని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు గవర్నర్లు కట్టుబడి ఉన్నారా? అనే ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు. కొందరు గవర్నర్ల వ్యవహార శైలి చూస్తుంటే వారికి నోరు ఉందే తప్ప చెవులు లేవనిపిస్తోందని అన్నారు.
కేవలం తమిళనాడు గవర్నర్ ఒక్కరే కాదు, తెలంగాణ గవర్నర్ తమిళిసై ది కూడా ఇదే తీరు, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టిన జగదీప్ ధన్ ఖడ్ కూడా ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేవారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్ వ్యవహారం మరింత వివాదాస్పదమవుతోంది.