అవి ఉచితాలు కాదు... సంక్షేమ పథకాలు.. స్టాలిన్
దేశంలో ఉచితాలు, అనుచితాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఉచితాలపై ప్రధాని మోడీ వ్యాఖ్యల పై విపక్షాలు విమర్షలు గుప్పిస్తున్నాయి. విద్య, వైద్యం లాంటివి ప్రజలకు ఫ్రీగా అందించడం కూడా 'ఉచితాలు' ఎలా అవుతాయంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ మోదీపై ద్వజమెత్తారు.
ఉచితాలపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి, టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగినట్టే తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ధ్వజమెత్తారు. పేదలు, బడుగువర్గాల సంక్షేమానికి తోడ్పడే పథకాలు ఉచితాలు కావని ఆయన అన్నారు. కొందరు ఉచితాలు వద్దనే సలహాతో బయలుదేరారని, దీనిపై దేశవ్యాప్త చర్చకు నాంది పలికారని ఆయన సెటైర్ వేశారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం చేసే వ్యయాన్ని ఉచితం అని ఎలా అంటాం.. ? ఈ ఖర్చును ఉచిత పథకంగా ఎలా పరిగణిస్తాం ? విద్య విజ్ఞానానికి సంబంధించినది.. అలాగే వైద్యం ప్రజల ఆరోగ్యం, మందులకు సంబంధించినది.. ఇవి సంక్షేమ పథకాలు.. వీటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అని స్టాలిన్ చెప్పారు. సంక్షేమ పథకాలు, ఉచితాలు వేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని, తమ ప్రభుత్వం విద్యార్థులు, పేదల సంక్షేమం కోసం ఇలాంటి పథకాలను అమలు చేస్తోందని అన్నారు. పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని, పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లకు సంబంధించిన స్కీంను అమలు చేయడం తప్పా అని స్టాలిన్ ప్రశ్నించారు. ఇలాంటివి సామాజిక సంక్షేమ పథకాలే తప్ప ఉచితాలని ఎలా అంటామని అన్నారు.
'ఉచితాలు, సోషల్ వెల్ ఫేర్ స్కీమ్స్ .. రెండూ వేర్వేరు.. ఎకానమీలో క్షీణత, సంక్షేమ పథకాల మధ్య తులనాత్మకత ఉండాలి.. ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించే పార్టీల గుర్తింపును రద్దు చేసే అవకాశాన్ని పరిశీలించాలన్న అభ్యర్థనను తోసిపుచ్చుతున్నాం' అని సుప్రీంకోర్టు ఇటీవల రూలింగ్ ఇచ్చింది. ఇది అప్రజాస్వామిక యోచన అని, మనం ప్రజాస్వామ్యాన్ని పాటిస్తున్నామని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారితో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
తమిళనాడు సీఎం స్టాలిన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. మోడీ ప్రభుత్వం ఉచితాల మీద ఎందుకు దృష్టి పెట్టిందో అర్థం కావడంలేదన్నారు. కొళత్తూర్ జిల్లాలో మొదటి సంవత్సరం కాలేజీ విద్యార్థులకు తాము ఉచిత తరగతులు నిర్వహిస్తున్నామని, ఇక రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా దీన్ని వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. ఇందుకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. ఇది మా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. మున్ముందు మరిన్ని జిల్లాల విద్యార్థులకు ఈ సౌకర్యాన్ని విస్తరించే ఆలోచన ఉందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం ఉచితాలకు సంబంధించిన తన కొత్త ఆలోచన విరమించుకోవాలని ఆయన కోరారు.