Telugu Global
National

ఎన్నికల ప్రచారంలో ఈడీ.. స్టాలిన్ ఘాటు విమర్శలు

రోజుల వ్యవధిలోనే ఇద్దరు డీఎంకే మంత్రులపై ఈడీ దాడులు తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి. కేంద్రం కుట్రపూరితంగా తమ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని డీఎంకే మండిపడింది.

ఎన్నికల ప్రచారంలో ఈడీ.. స్టాలిన్ ఘాటు విమర్శలు
X

ఇప్పటికే తమిళనాడు గవర్నర్ తమ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, ఇప్పుడు ఈడీ కూడా ఈ ప్రచారంలో చేరిందని, ఇక తమకి ఎన్నికల పని సులువు అవుతుందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు తమిళనాడు సీఎం స్టాలిన్. సార్వత్రిక ఎన్నికల వేళ.. తమిళనాడులో డీఎంకేని టార్గెట్ చేసుకుని ఈడీ సోదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు స్టాలిన్. ఇలాంటి బెదిరింపులకు డీఎంకే భయపడదని స్పష్టం చేశారు.

తమిళనాడులో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి నివాసంలో ఈడీ తాజాగా దాడులు మొదలు పెట్టింది. 2007 నుంచి 2011 మధ్య గత డీఎంకే ప్రభుత్వంలో పొన్ముడి గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో క్వారీ లైసెన్సు నిబంధనలను ఉల్లంఘించారని, గనుల కేటాయింపుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసిన ఈడీ.. మంత్రి పొన్ముడి, ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్‌ సిగమణి పొన్‌ నివాసాల్లో సోదాలు చేపట్టింది. ఇటీవల మనీలాండరింగ్‌ కేసులో రాష్ట్ర మంత్రి సెంథిల్‌ బాలాజీని ఈడీ అరెస్టు చేసింది, ఇప్పుడు మరో మంత్రి పొన్ముడిని టార్గెట్ చేసింది. రోజుల వ్యవధిలోనే ఇద్దరు డీఎంకే మంత్రులపై ఈడీ దాడులు తమిళనాడులో రాజకీయ దుమారం రేపాయి. కేంద్రం కుట్రపూరితంగా తమ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తోందని డీఎంకే మండిపడింది.

కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ బెంగళూరులో సమావేశం పెట్టుకున్న వేళ, ఇలా బెదిరింపులకు దిగడం సరికాదంటున్నారు సీఎం స్టాలిన్. ఇటీవలే పొన్ముడిపై ఉన్న రెండు కేసులను కోర్టు కొట్టేసిందని, ఇప్పుడు ఈడీ సోదాలు చేపట్టిందని, ప్రతిపక్షాల భేటీ నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారాయన. కాంగ్రెస్‌ కూడా ఈడీ సోదాలను తీవ్రంగా ఖండించింది. విపక్షాల భేటీకి ముందు తమిళనాడు మంత్రిపై దాడులు జరగడాన్ని బెదిరింపు చర్యగానే భావిస్తున్నామని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. విపక్షాలను విడగొట్టేందుకు మోదీ ప్రభుత్వం రాసిన స్క్రిప్ట్‌ ఇదని ఆరోపించారు.

First Published:  17 July 2023 10:16 AM GMT
Next Story