Telugu Global
National

సీఆర్పీఎఫ్ పరీక్షలు హిందీ వాళ్లకోసమేనా..?

ఇంగ్లీష్‌, హిందీలో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందని సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్‌ లో పేర్కొనడం ‘వివక్షత’, ‘ఏకపక్షం’ అని విమర్శించారు.

సీఆర్పీఎఫ్ పరీక్షలు హిందీ వాళ్లకోసమేనా..?
X

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లోని 9,212 ఖాళీలలో 579 పోస్ట్ లను తమిళనాడు నుంచి భర్తీ చేయాల్సి ఉంది. మరి క్వశ్చన్ పేపర్ లో హిందీ మీడియం అవసరమా..? 100 మార్కుల ప్రశ్నా పత్రంలో హిందీ ప్రాథమిక అవగాహన కోసం 25 మార్కులు కేటాయించడం అవసరమా..? కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. ఆయనకు ఓ లేఖాస్త్రం సంధించారు. కేంద్ర ప్రభుత్వం తమిళంపై వివక్ష చూపుతోందనడానికి ఇదే పెద్ద నిదర్శనం అని చెప్పారు. సెంట్రల్‌ పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ కోసం నిర్వహించే కంప్యూటర్‌ టెస్ట్‌ లో తమిళాన్ని చేర్చకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

తమిళనాడునుంచి సీఆర్పీఎఫ్ కోసం యువతను రిక్రూట్ చేయాల్సిన నేపథ్యంలో పెడుతున్న పరీక్షకు హిందీ అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు సీఎం స్టాలిన్. హిందీ మాట్లాడని యువకులు కూడా సీఆర్పీఎఫ్‌ పరీక్ష రాసేందుకు వీలుగా తమిళంతో సహా అన్ని ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ఇంగ్లీష్‌, హిందీలో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుందని సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్‌ లో పేర్కొనడం ‘వివక్షత’, ‘ఏకపక్షం’ అని విమర్శించారు. దీని వల్ల తమిళనాడుకు చెందిన ఉద్యోగార్థులు తమ సొంత రాష్ట్రంలో మాతృభాషలో పరీక్ష రాయలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు.

సీఆర్పీఎఫ్‌ నోటిఫికేషన్ తమిళ అభ్యర్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందన్నారు ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్. ఇది రాజ్యంగ హక్కుకు విరుద్ధమని పేర్కొన్నారు. ఆమధ్య స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల విషయంలో కూడా తెలంగాణ నుంచి ఒత్తిడి రావడంతో కేంద్రం దిగొచ్చింది. ఇప్పుడు సీఆర్పీఎఫ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

First Published:  9 April 2023 5:37 PM IST
Next Story