టికెట్ ఇవ్వలేదని ఎంపీ ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ మృతి
మార్చి 24న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించగా, ఆయన పరీక్షించిన వైద్యులు విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఎంపీ ఆత్మహత్యకు యత్నించినట్టు గుర్తించారు.
ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఎండీఎంకే నేత, ఈరోడ్ నియోజకవర్గ ఎంపీ గణేశమూర్తి (77) గురువారం ప్రాణాలు కోల్పోయారు. కోయంబత్తూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
డీఎంకేతో పొత్తులో భాగంగా 2019 ఎన్నికల్లో ఎండీఎంకే అభ్యర్థిగా ఈరోడ్ నుంచి గణేశమూర్తి పోటీ చేశారు. అయితే ఆయన అప్పట్లో డీఎంకే ఎన్నికల గుర్తయిన ఉదయించే సూర్యుడి గుర్తుపైనే పోటీ చేసి విజయం సాధించారు. ఇక తాజా ఎన్నికల్లో ఈరోడ్ సీటు పొత్తు సర్దుబాట్లలో ఎండీఎంకేకు దక్కలేదు. ప్రస్తుత ఎన్నికల్లో ఎండీఎంకేకు తిరుచ్చిని కేటాయించారు. దీంతో ఆ స్థానం నుంచి దురై వైగోను ఆ పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గణేశమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ క్రమంలోనే మార్చి 24న ఆయన ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించగా, ఆయన పరీక్షించిన వైద్యులు విషపూరిత ట్యాబ్లెట్లు మింగి ఎంపీ ఆత్మహత్యకు యత్నించినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ఆ తర్వాత బయటికి వెల్లడించాయి. గత నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన.. గురువారం ఉదయం పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వారు చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు.
1993లో ఎండీఎంకే ప్రారంభమైనప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన గణేశమూర్తి తొలిసారిగా పళని నియోజకవర్గం నుంచి 1998లో పోటీ చేశారు. తొలిసారే ఎంపీ గెలుపొందారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి విజయం సాధించారు. 2009లో ఈరోడ్ నుంచి ఎంపీగా గెలుపొందిన ఆయన.. 2014లో ఓటమి పాలయ్యారు. ఇక 2019లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో సాధించడం విశేషం.