Telugu Global
National

ప్రభుత్వ కార్యక్రమంలో పూజారెందుకు.. అధికారులపై ఎంపీ మండిపాటు

శంకుస్థాపన కార్యక్రమంలో పూజారి ఉండటం గమనించిన ఎంపీ సెంథిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజారి ఉండాలని ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ కార్యక్రమంలో పూజారెందుకు.. అధికారులపై ఎంపీ మండిపాటు
X

ఏదైనా మంచి పని, కార్యక్రమం ప్రారంభించే ముందు తమ మతాచారాలను పాటిస్తూ ప్రార్థనలు, పూజలు చేయడం మన దేశంలో పరిపాటే. సెక్యులర్ దేశంగా పేరుపడిన ఇండియాలో ప్రభుత్వ కార్యక్రమాలు కూడా పూజలు లేకుండా ప్రారంభం కావు. రోడ్డు, భవనం, పథకాలు ఏవైనా ప్రారంభించాలంటే పూజలు జరిగిపోతూనే ఉంటాయి. ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎవరూ అభ్యంతరం చెప్పరు. కానీ తమిళనాడులో మాత్రం ఒక ఎంపీకి కోపం వచ్చింది. ప్రభుత్వ కార్యక్రమంలో పూజారితో పూజలెందుకు చేయిస్తున్నారంటూ అధికారులపై మండిపడ్డారు.

తమిళనాడులోని వెల్లూరు నగరానికి సమీపంలో ఉన్న అల్లాపురం చెరువు సుందరీకరణ పనుల ప్రారంభం కోసం పెన్నగరం సమీపంలో అధికారులు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డీఎంకే ధర్మపురి ఎంపీ ఎస్. సెంథిల్ కుమార్‌ను పిలిచారు. అయితే అక్కడ అప్పటికే పూజలు చేయడానికి పూజారిని పీడబ్ల్యూడీ అధికారిని పిలిపించారు. శంకుస్థాపన కార్యక్రమంలో పూజారి ఉండటం గమనించిన ఎంపీ సెంథిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పూజారి ఉండాలని ఏమైనా నిబంధనలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

ఒక వేళ పూజారి ఉండాలని నిబంధనలు ఉంటే.. కేవలం హిందూ మతానికి చెందిన వారినే ఎందుకు పిలిచారు? చర్చి ఫాదర్‌ని, ముస్లిం మ‌త గురువుల‌ను ఎందుకు పిలవలేదు అని మండిపడ్డారు. పిలవాలనుకుంటే అన్ని మతాల పూజారులను పిలవాలని.. లేకుండా వదిలేయాలని అన్నారు. ఎంపీ సెంథిల్ మాట్లాడిన మాటలన్నీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

''తమిళనాడు రాష్ట్రంలో ద్రవిడియన్ పద్దతులను ఆచరిస్తున్నాము. సీఎం ఎంకే స్టాలిన్ కూడా తాను పాల్గొనే ఏ కార్యక్రమంలో కూడా మతాచారాలను పాటించమని చెప్పరు. ఎక్కడ కూడా ప్రార్థనలు జరగవు. అలాగే నేను ఎక్కడైనా ముఖ్య అతిథిగా వెళ్లాల్సి ఉంటే.. ముందుగానే అధికారులకు ఆ పద్దతి పాటించమని చెప్తాను. ఇలాంటి మతాచారాలను ప్రభుత్వ కార్యక్రమాల్లో పాటించ వద్దని, ఒకవేళ పాటించాల్సి వస్తే నన్ను పిలవొద్దని ముందుగానే చెప్పాను. నేను ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మిగతా మతాలను వదిలేసి ఒకే మతానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలని మాత్రమే ప్రశ్నిస్తున్నాను'' అని ఎంపీ సెంథిల్ అన్నారు.

ఒక వేళ నాస్తికత్వాన్ని పాటించే వాళ్లు.. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే.. ఇతర మతాలను ఆచరించేవాళ్లను పిలవకపోవడమే మంచిదని సెంథిల్ హితవు పలికారు. సోషల్ మీడియాలో ఎన్ని కామెంట్లు వచ్చినా నేను పట్టించుకోనని.. తాను ఏ ధర్మాన్ని ఆచరించను కాబట్టే.. అలాగే నేను పాల్గొనే కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటానన్నారు. ఆ కార్యక్రమంలో చివరకు ఎలాంటి పూజలు, ప్రార్థనలు చేయకుండానే శంకుస్థాపన చేసి సెంథిల్ వెళ్లిపోయారు.

First Published:  19 July 2022 6:00 AM GMT
Next Story