Telugu Global
National

తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

గోపీనాథ్ మాతృభాష తెలుగు కావడంతోనే ఆయన తెలుగులో ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతాలు ఏపీ సరిహద్దుల్లో ఉంటాయి.

తెలుగులో ప్రమాణస్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ
X

ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో 18వ లోక్ సభకు ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తమిళనాడు నుంచి ఎంపీగా గెలిచిన కె.గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమిళనాడు ప్రజలకు తమ భాషపై ఎంతో మమకారం ఎక్కువ. హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్చుకోవడానికి కూడా వారు ఆసక్తి చూపరు. అటువంటి తమిళనాడు నుంచి ఎన్నికైన ఒక ఎంపీ పార్లమెంటులో తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గోపీనాథ్ గతంలో హోసూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి పార్లమెంటు స్థానం నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. పార్లమెంట్ లో మంగళవారం ఎంపీల ప్రమాణ స్వీకారం జరుగగా.. గోపినాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. ఆఖరిలో నండ్రి, వణక్కం, జై తమిళనాడు అంటూ తమిళంతో ముగించారు. తమిళనాడు నుంచి ఎంపీగా ఎన్నికైన ఒక వ్యక్తి తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం చర్చనీయాంశం అయ్యింది.

గోపీనాథ్ మాతృభాష తెలుగు కావడంతోనే ఆయన తెలుగులో ప్రమాణం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని హోసూరు, క్రిష్ణగిరి ప్రాంతాలు ఏపీ సరిహద్దుల్లో ఉంటాయి. ఈ ప్రాంతంలోని జనాభాలో సగం మంది తెలుగువారే ఉంటారు. వ్యాపారం, ఉపాధి నిమిత్తం తెలుగువారు ఆ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు.

అలా స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తే గోపీనాథ్. ఈయన ఎమ్మెల్యేగా వ్యవహరించిన సమయంలో కూడా అసెంబ్లీలో తెలుగులో ప్రసంగించేవారు. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా ఆయనకు తెలుగులోనే సమాధానాలు చెప్పేవారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీలందరూ తెలుగులోనే ప్రమాణస్వీకారం చేయగా.. తమిళనాడు నుంచి ఎంపీగా ఎన్నికైన గోపీనాథ్ అక్కడే స్థిరపడ్డప్పటికీ మాతృభాషపై మమకారంతో తెలుగులో ప్రమాణస్వీకారం చేసి తెలుగు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.

First Published:  26 Jun 2024 1:15 AM IST
Next Story