Telugu Global
National

డిప్యూటీ సీఎం పదవా? నాకా? ఉదయనిధి స్టాలిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మీడియా ప్రతినిధులు త్వరలో మీరు డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారట కదా..? అని ఉదయనిధిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

డిప్యూటీ సీఎం పదవా? నాకా? ఉదయనిధి స్టాలిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో మీరు డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారట కదా..? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. నాకు డిప్యూటీ సీఎం పదవా..? ఆ విషయం గురించి మీరు చెబితే కానీ తెలియలేదే..! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సుదీర్ఘకాలం తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతేకాదు ఆయన సుప్రసిద్ధ సినీ రచయిత కూడా. తాత అడుగుజాడల్లోనే ఉదయనిధి స్టాలిన్ కూడా సినీ రంగ ప్రవేశం చేశారు. ఓకే ఓకే అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు సంపాదించుకున్నారు.

గత ఎన్నికలకు ముందు ఆయన డీఎంకే తరఫున రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. డీఎంకే అధికారంలోకి రావడానికి ఉదయనిధి కూడా తన వంతు పాత్ర పోషించారు. ఆయన తండ్రి స్టాలిన్ ముఖ్యమంత్రి కాగా.. ఉదయనిధికి కూడా మంత్రి పదవి ఖాయం అనుకున్నప్పటికీ ఆయనకు మొదటి దఫా ఆ అవకాశం దక్కలేదు.

అయితే కొన్ని నెలల తర్వాత కేబినెట్ లో జరిగిన మార్పులతో అనూహ్య రీతిలో ఉదయనిధి యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కొద్ది రోజులుగా ఉదయనిధి డిప్యూటీ సీఎం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆ లోగా ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెడితే పార్టీ మరింత బలోపేతం అవుతుందని డీఎంకే పెద్దలు భావిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో తాజాగా షోలింగనల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు త్వరలో మీరు డిప్యూటీ సీఎం పదవి చేపట్టబోతున్నారట కదా..? అని ఉదయనిధిని ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాంటి విషయమేది తనకు తెలియదని చెప్పారు. ఉదయనిధి ఇచ్చిన క్లారిటీతో త్వరలో ఆయన డిప్యూటీ సీఎం కానున్నారని జరుగుతున్న ప్రచారం కేవలం పుకారు మాత్రమే అని తేలింది.

First Published:  10 Jun 2023 11:15 AM IST
Next Story