తమిళనాడు మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష
డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఆఫీసర్స్ మంత్రి పొన్ముడిపై, ఆయన భార్యపై 2002లో కేసు నమోదు చేశారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వం 1996–2001 మధ్య కాలంలో అధికారంలో ఉండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
డీఎంకే నాయకుడు, తమిళనాడు మంత్రిపై అవినీతి కేసులో ఆయన దోషిగా తేల్చుతూ మద్రాసు హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ మేరకు ఆయన మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు.. రూ.50 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. న్యాయస్థానంలో దోషిగా తేలిన మంత్రి.. కె.పొన్ముడి. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే విషయం విచారణలో నిర్ధారణ అయింది.
డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ ఆఫీసర్స్ మంత్రి పొన్ముడిపై, ఆయన భార్యపై 2002లో కేసు నమోదు చేశారు. ఏఐఏడీఎంకే ప్రభుత్వం 1996–2001 మధ్య కాలంలో అధికారంలో ఉండగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లోనే పొన్ముడి, ఆయన భార్య ఆదాయం రూ.1.4 కోట్లుగా ఉంది. ఆర్థిక వనరులకు మించి వారి వద్ద డబ్బు ఉందని అధికారుల దర్యాప్తులో తేలింది. 1996–2001 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో పొన్ముడి అక్రమ సంపదను కూడబెట్టారని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఈ కేసులో తగిన సాక్షాధారాలను సమర్పించడంలో అధికారులు విఫలమయ్యారని పేర్కొంటూ వెల్లూరులోని ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు జూన్ 28న పొన్ముడి, ఆయన భార్య నిర్దోషులుగా ప్రకటించింది. అయితే.. ఆగస్టులో మద్రాస్ హైకోర్టు ఈ తీర్పును సుమోటోగా తీసుకుంది. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. అయితే.. కేసు చాలా పాతదని, ప్రస్తుతం తనకు 73 ఏళ్లు కాగా, తన భార్యకు 60 ఏళ్లని, వృద్ధాప్యం కారణంగా కనీస శిక్ష తగ్గించాలని పొన్ముడి, ఆయన భార్య న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.