Telugu Global
National

యూట్యూబ్ చూస్తూ ప్ర‌స‌వం చేసి.. భార్య మృతికి కార‌ణ‌మైన భ‌ర్త‌

ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందించేందుకు నిరాకరించాడు. తానే ఆమెకు గింజలు, ఆకు కూరలు ఆహారంగా అందించేవాడు.

యూట్యూబ్ చూస్తూ ప్ర‌స‌వం చేసి.. భార్య మృతికి కార‌ణ‌మైన భ‌ర్త‌
X

యూట్యూబ్ చూస్తూ ప్ర‌స‌వం చేసి భార్య మృతికి కార‌ణ‌మ‌య్యాడో భ‌ర్త‌. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ సంఘ‌ట‌న‌పై జిల్లా క‌లెక్ట‌ర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసి పోలీసుల‌ను విచార‌ణ‌కు ఆదేశించారు. దీనిపై పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..

మృతురాలు లోక‌నాయ‌కి పుట్టినిల్లు పోచంపల్లి సమీపంలోని పులియాంపట్టి గ్రామం. ధర్మపురి జిల్లా అనుమంతపురం గ్రామవాసి మాదేశ్‌తో 2021లో ఆమెకు పెళ్లి చేశారు. మాదేశ్ సేంద్రియ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నాడు. భార్య ఇటీవల గర్భం దాల్చగా.. ఆమెకు కూడా ఎలాంటి మందులూ లేకుండా సహజ పద్ధతిలో ప్రసవం జరగాలని భావించాడు. ఆ మేరకు భార్య‌కు వైద్యపరీక్షలు సైతం చేయించలేదు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆమె పేరును ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేసుకోవాలని సూచించినా.. మాదేశ్ ఒప్పుకోలేదు.

ప్రసవ సమయంలో ప్రభుత్వం అందించే వ్యాక్సిన్లతో పాటు పౌష్టికాహారాన్ని కూడా అందించేందుకు నిరాకరించాడు. తానే ఆమెకు గింజలు, ఆకు కూరలు ఆహారంగా అందించేవాడు. ఈ క్రమంలో ఆగస్టు 22వ తేదీ మంగ‌ళ‌వారం నాడు ఇంట్లో ఉన్న లోకనాయకికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. మాదేశ్ తన ఫోనులో యూట్యూబ్ చూస్తూ భార్యకు ప్రసవం చేశాడు. మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన లోక‌నాయ‌కి.. స‌రైన రీతిలో వైద్యం అంద‌క‌పోవ‌డం వ‌ల్ల అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితిలో మాదేశ్ ఆమెను కున్నియార్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ‌మ‌ధ్యలోనే ప్రాణాలు విడిచింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పోచంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్ప‌త్రి డాక్ట‌ర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

*

First Published:  24 Aug 2023 8:23 AM IST
Next Story