మర్మాంగాలపై దాడి ఘటనలో ఐపీఎస్ అధికారిపై వేటు వేసిన తమిళనాడు సర్కార్
వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణ ముగిసే వరకు ఏఎస్పీని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
తమిళనాడులో ఇటీవల కాలంలో లాకప్ డెత్స్ పెరిగిపోతున్నాయి. దీంతో మానవ హక్కుల సంఘాల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ ఘటనలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి ఇటీవల ఓ కేసు విచారణలో నిందితుడి మర్మాంగాలపై దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఆ అధికారిపై చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించింది.
తమిళనాడులోని తిరునల్వేలి జిల్లా అంబా సముద్రంలో 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బల్వీర్ సింగ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పదిరోజుల క్రితం జరిగిన ఓ దాడి కేసులో ఐదుగురు నిందితులను ఆయన విచారణ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ తమను తీవ్రంగా వేధించారని వారు ఆరోపించారు. ఏఎస్పీ కటింగ్ ప్లేర్‌తో తమ పళ్లు పీకాడని, ఇటీవలే వివాహమైన ఓ యువకుడిని మర్మాంగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. మర్మాంగాలపై దాడికి గురైన వ్యక్తి పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉందని ఆ వీడియోలో వారు వివరించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ న్యాయ విచారణకు ఆదేశించారు. విచారణ ముగిసే వరకు ఏఎస్పీని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు మాత్రం ఆ అధికారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ ఐపీఎస్ అధికారిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రకటించింది. తమిళనాడులో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హెచ్చరించారు. మరోపక్క ఇటీవల కాలంలో కస్టడీ మరణాలు పెరుగుతుండటంతో సీసీటీవీ పర్యవేక్షణలో నిందితుల విచారణ జరగాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.