Telugu Global
National

12 గంటల పని విధానంపై వెనక్కి.. బిల్లు రద్దు చేసిన స్టాలిన్ ప్రభుత్వం

అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కార్మికులకు పని గంటలు తగ్గిస్తుంటే ఇక్కడ పెంచుతున్నారని, దీనివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని పలువురు రాజకీయ నాయకులు మండిపడ్డారు.

12 గంటల పని విధానంపై వెనక్కి.. బిల్లు రద్దు చేసిన స్టాలిన్ ప్రభుత్వం
X

తమిళనాడు వ్యాప్తంగా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో 12 గంటల పని విధానాన్ని అమలు చేయాలని తీసుకున్న నిర్ణయంపై త‌మిళ‌నాడు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అసెంబ్లీలో ఆమోదించిన కార్మిక చట్ట సవరణ ముసాయిదాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. కొద్ది రోజుల కిందట తమిళనాడు వ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమల్లో 12 గంటల పని విధానాన్ని అమల్లోకి తెస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక బిల్లు ఆమోదించింది. అయితే డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి.

అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కార్మికులకు పని గంటలు తగ్గిస్తుంటే ఇక్కడ పెంచుతున్నారని, దీనివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని పలువురు రాజకీయ నాయకులు మండిపడ్డారు. ఇక ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుపై కార్మిక సంఘాలు తీవ్ర వ్యతిరేకత తెలిపాయి. మే 12వ తేదీన సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో డీఎంకే ప్రభుత్వం పునరాలోచనలో పడింది. కార్మిక చట్ట సవరణకు వ్యతిరేకత రావడంతో కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించేందుకు మంత్రులు ఏవీ వేలు, అన్బరసన్, గణేషన్ లతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ సోమవారం సాయంత్రం గుర్తింపు పొందిన 12 కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. 12 గంటల పని విధానం అమల్లోకి వస్తే కార్మికులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి కార్మిక సంఘాల ప్రతినిధులు కమిటీకి వివరించారు. కార్మిక సంఘాల సూచించిన అభిప్రాయాలను కమిటీ ముఖ్యమంత్రి స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లింది.

అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్ కార్మిక చట్ట సవరణ ముసాయిదా బిల్లును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా డీఎంకే ప్రభుత్వం పాలన సాధిస్తోందన్నారు. కొన్ని కార్మిక సంఘాల సూచనలతో కొన్ని పరిశ్రమలకు మాత్రమే వర్తింపజేసేలా కార్మిక చట్ట సవరణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అయితే ఈ బిల్లును కార్మిక సంఘాలతో పాటు పలు పార్టీలు వ్యతిరేకించినట్లు చెప్పారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును నిలిపి వేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.

First Published:  25 April 2023 9:01 AM IST
Next Story