గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. బడ్జెట్ ప్రసంగం చేయకుండానే వెళ్లిపోయిన RN రవి
జాతీయగీతం పాడమంటే సభ్యులు స్పందించలేదంటూ వచ్చిన రెండు నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి గవర్నర్ తిరిగి వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది.
గత కొన్నాళ్లుగా తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇన్నాళ్లూ బిల్లులు ఆమోదించకపోవడం తదితర కారణాలతో స్టాలిన్ ప్రభుత్వానికి గవర్నర్‌కి మధ్య నడుస్తున్న వార్ ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీని తాకింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రసంగం చేయకుండానే గవర్నర్ ఆర్.ఎన్. రవి వెనుదిరిగారు. జాతీయగీతం పాడమంటే సభ్యులు స్పందించలేదంటూ వచ్చిన రెండు నిమిషాల్లోనే అసెంబ్లీ నుంచి తిరిగి వెళ్లిపోవడం సంచలనం సృష్టించింది.
రాజ్యాంగాన్ని అవమానించడమే
తన ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని ఎన్నిసార్లు అడిగినా సభ్యులు స్పందించలేదని, అదీ కాక తన ప్రసంగంలోని చాలా అంశాలను తాను నైతికంగా అంగీకరించలేనని గవర్నర్ అన్నారు. వాటిని చదివితే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లే అని వ్యాఖ్యానించి, ప్రసంగం చదవకుండానే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు గవర్నర్ ఆర్.ఎన్.రవి.
నిరుడూ ఇదే తీరు
గత సంవత్సరం కూడా గవర్నర్ రవి ఇలా ప్రసంగం విషయంలో ప్రభుత్వానికి షాకిచ్చారు. కొన్ని అంశాలను తీసేసి, కొన్నింటిని సొంతంగా చేర్చి చదవడం అప్పట్లో దుమారం రేపింది. ఆయన ప్రసంగంలోని ఆ వ్యాక్యాలను తీసేసి, అసెంబ్లీ ఆమోదించుకుంది. అప్పటి నుంచి గవర్నర్, సీఎంల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ ప్రభావం అసెంబ్లీలో మళ్లీ ఇలా బయటపడింది.