Telugu Global
National

పీచు మిఠాయిపై నిషేధం – తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

అందరూ ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దానికి ప్రధాన కారణం అందులో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడమే.

పీచు మిఠాయిపై నిషేధం – తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
X

అందరూ ఎంతో ఇష్టంగా తినే పీచు మిఠాయి విక్రయాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దానికి ప్రధాన కారణం అందులో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడమే. తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. పీచు మిఠాయి నాణ్యతను పరీక్షించేందుకు ఇటీవల ఫుడ్‌ సేఫ్టీ విభాగ అధికారులు చెన్నై వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో స్వాధీనం చేసుకున్న నమూనాలను అధ్యయనం చేయగా.. కాటన్‌ క్యాండీల్లో రోడమైన్‌–బి అనే కెమికల్‌ ఉన్నట్టు గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది.

రోడమైన్‌–బిని ’ఇండస్ట్రియల్‌ డై’గా పిలుస్తారు. దుస్తుల కలరింగ్, పేపర్‌ ప్రింటింగ్‌లో దీనిని ఎక్కువగా వినియోగిస్తారు. అంటే ఫుడ్‌ కలరింగ్‌ కోసం దీన్ని ఉపయోగించే అవకాశం లేదు. దీనివల్ల దీర్ఘకాలంలో సమస్యలు తలెత్తే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుందని, అల్సర్‌ వంటి సమస్యలతో పాటు క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

ఆరోగ్య నిపుణుల పరిశోధనల నివేదికలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం దీని విక్రయాలపై నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి తయారీ, విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోనూ పీచు మిఠాయిపై నిషేధం అమల్లో ఉంది.

First Published:  17 Feb 2024 6:34 PM IST
Next Story