తెలంగాణ రైతు పథకాలపై తమిళనాడులో చర్చ.. దేశమంతా అమలుచేయాలని రైతుల డిమాండ్
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని తమిళనాడు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కేసీఆర్ సర్కార్ చేపడుతున్న పథకాలు దేశాభివృద్దికి ఎంతో ఉపయోగపడతాయని రైతునాయకులు అభిప్రాయపడ్డారు.
తెలంగాణలో రైతుల కోసం ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవడమే కాదు ప్రశంసలు కూడా పొందుతున్నాయి. ఆదివారంనాడు తమిళనాడులో జరిగిన ఓ రైతుల సభలో తెలంగాణలో అమలవుతున్న పథకాలపై చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా ఆ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశాయి రైతు సంఘాలు.
ఆదివారం తమిళనాడులోని కాంచీపురంలో రైతు సంఘాలు, పరిశ్రమల సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. అందులో తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న అనేక పథకాలు చర్చనీయాంశంగా మారాయి. రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు అన్ని రాష్ట్రాలు తెలంగాణ మోడల్‌ను అనుసరించాలని సభలో వక్తలు కోరారు. తమిళనాడు రాష్ట్ర మంత్రులు అన్బరసన్, చక్రపాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ సభలో దక్షిణ భారత రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కోటపాటి నరసింహం నాయుడు మాట్లాడుతూ... తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తు, పంటలకు అవసరమైన నీటినందించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు చేపడుతున్న తీరుతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు రైతు అనుకూల కార్యక్రమాల సభకు వివరించారు. దళారులను తగ్గించి రైతులు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన వివరించారు.
ఈ సభలో రైతు నాయకులు పికె దైవసిగమనై, ఎకె బాబు, వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వీళ్ళందరూ ఏకగ్రీవంగా కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం చేపడుతున్న పథకాలను తమిళనాడు అనుసరించాలని కోరారు. అంతే కాదు ప్రతి రాష్ట్రం ఈ పథకాలను అమలుపరిస్తే దేశం అభివృద్ది పథంలో ముందుకు నడుస్తుందని రైతు నాయకులు అభిప్రాయపడ్డారు.