Telugu Global
National

డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. తమిళనాడు సీఎం సంచలన వ్యాఖ్యలు

తమిళనాడులో ఉత్తరాది వలస కార్మికులపై దాడులు జరుగుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ప్రభుత్వం విచారణ జరిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోలు నకిలీవని తేల్చింది.

డీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. తమిళనాడు సీఎం సంచలన వ్యాఖ్యలు
X

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు జరుగుతున్నట్లు ఆయన ఆరోపణలు చేశారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వానికి పూర్తిస్థాయి మెజారిటీ ఉంది. అయినా స్టాలిన్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రాధాన్యం సంతరించుకుంది. తమిళనాడులో ఉత్తరాదివాసులపై ముఖ్యంగా బీహారీలపై దాడులు జరుగుతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు, వీడియోలు ప్రత్యక్షమయ్యాయి.

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా రాష్ట్రంలో బీహార్ కు చెందిన వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీహార్ కు చెందిన పలువురు కార్మికులు సొంత రాష్ట్రానికి వెళ్లిపోయారు. మరి కొంతమంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఫోన్ చేసి తమిళనాడులో నెలకొన్న పరిస్థితిపై ఆరా తీశారు.

ఈ నేపథ్యంలో తమిళనాడులో ఉత్తరాది వలస కార్మికులపై దాడులు జరుగుతున్నట్లు వస్తున్న ప్రచారంపై ప్రభుత్వం విచారణ జరిపింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలు, ఫోటోలు నకిలీవని తేల్చింది. ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమిళనాడులో బీహారీలపై దాడులు జరుగుతున్నట్లు కావాలని ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం నిర్ధారించింది.

ఈ నేపథ్యంలో స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగర్ కోవిల్ లో ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులో జరుగుతున్న అభివృద్ధి, ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందడాన్ని సహించలేని కొన్ని దుష్టశక్తులు తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఎలాగైనా శాంతి భద్రతలకు విఘాతం సృష్టించాలని చూస్తున్నాయని ఆరోపించారు. అటువంటి వారి కలలు ఫలించవని ఆయన అన్నారు.

తమ రాష్ట్రంలో ఉత్తరాది వలస కార్మికులు సురక్షితంగా ఉన్నారని స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో పనిచేయడంపై ఎలాంటి భయాందోళనలు అవసరంలేదని మరోసారి చెప్పారు. పుకార్లు సృష్టించి ఉత్తరాది వాసులను భయభ్రాంతులను గురిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని స్టాలిన్ ప్రకటించారు.

First Published:  8 March 2023 8:15 AM IST
Next Story