Telugu Global
National

బీజేపీని ఓడించేందుకు నేత‌లంతా స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు..

ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వంపై మాత్రం ఈ భేటీలో నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆయ‌న తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రజాస్వామిక శక్తుల‌నూ ఏకం చేయాలని తీర్మానం చేసినట్టు వెల్లడించారు.

బీజేపీని ఓడించేందుకు నేత‌లంతా స్ప‌ష్ట‌త‌తో ఉన్నారు..
X

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని మ‌ళ్లీ అధికారంలోకి రాకుండా చేయాల‌నే విష‌యంలో విప‌క్షాల భేటీలో పాల్గొన్న పార్టీల‌న్నీ స్ప‌ష్ట‌త‌తో ఉన్నాయ‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, డీఎంకే అధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. పాట్నాలో బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్ ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వారం నిర్వ‌హించిన విప‌క్షాల భేటీ అనంత‌రం చెన్నై చేరుకున్న స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వంపై మాత్రం ఈ భేటీలో నిర్ణ‌యం తీసుకోలేద‌ని ఆయ‌న తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు అన్ని ప్రజాస్వామిక శక్తుల‌నూ ఏకం చేయాలని తీర్మానం చేసినట్టు వెల్లడించారు.

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పార్టీలన్నీ గట్టిగా నిలబడాలని తాను ఈ సందర్భంగా నొక్కి చెప్పినట్టు స్టాలిన్ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో ప్రభావం చూపే పార్టీ నాయకత్వంలో కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు తాను మొత్తం ఏడు సూచనల‌ను ఈ సమావేశం ముందు ఉంచానని వివ‌రించారు.

అది సాధ్యపడకపోతే సీట్ల పంపకం గురించి ఆలోచించవచ్చని చెప్పినట్టు స్టాలిన్ తెలిపారు. ఎన్నికల అనంతరం పొత్తు ప్రసక్తి ఉండరాదని, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని అంగీకరించాలని చెప్పారు. అలాగే అవసరమైన చోట్ల ఉమ్మడి అభ్యర్థులను ప్రతిపాదించాలని తాను సూచించినట్టు తెలిపారు. విప‌క్షాల భేటీలో మొత్తం 15 రాజ‌కీయ పార్టీల ముఖ్య నేత‌లు హాజ‌ర‌య్యారు.

First Published:  24 Jun 2023 7:24 AM IST
Next Story