`డీఎంకే ఫైల్స్`పై తమిళనాడు సీఎం గరంగరం - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పరువు నష్టం కేసు
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఏప్రిల్ 14న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం స్టాలిన్ పరువుకు భంగం కలిగించేవిధంగా వ్యాఖ్యలు చేశారని.. పలు వీడియోలు కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారని దావాలో పేర్కొన్నారు.
`డీఎంకే ఫైల్స్` పేరుతో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం సీఎం స్టాలిన్ ప్రతిష్టను దిగజార్చడం కోసమే నిరాధార ఆరోపణలు చేశారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఆ ఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ డీఎంకే ఇంతకుముందే అన్నామలైకి లీగల్ నోటీసులు ఇచ్చింది. మంత్రి ఉదయనిధి స్టాలిన్, దురై మురుగన్, ఈవీ వేలు, సెంథిల్ బాలాజీలతో పాటు పలువురు డీఎంకే నేతలు కూడా అన్నామలైకి ఈ వ్యవహారంలో నోటీసులు పంపించారు.
క్షమాపణలకు అన్నామలై నో..
క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన అన్నామలై.. చట్టపరమైన చర్యలకు తాను సిద్ధంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఆయనపై పరువు నష్టం దావా వేశారు. చెన్నై సివిల్ కోర్టులో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరఫున సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవరాజన్ ఈ కేసు వేశారు.
దావాలో ఏముందంటే..
బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఏప్రిల్ 14న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం స్టాలిన్ పరువుకు భంగం కలిగించేవిధంగా వ్యాఖ్యలు చేశారని.. పలు వీడియోలు కూడా ఈ సందర్భంగా ప్రదర్శించారని దావాలో పేర్కొన్నారు. అయితే అవన్నీ అవాస్తవాలేనని.. సీఎం ప్రతిష్టను దిగజార్చేందుకే ఈ ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
2011లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో చెన్నై మెట్రో రైల్ కాంట్రాక్టు విషయంలో అవినీతి చోటుచేసుకుందనేది అన్నామలై ఆరోపణ. ఆ చెల్లింపులు కూడా షెల్ కంపెనీల ద్వారా జరిగాయని పేర్కొన్నారు. వాటితో పాటు డీఎంకే ముఖ్య నేతల ఆస్తులు.. ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నదానికంటే భారీ స్థాయిలో పెరిగాయని ఆరోపించారు.