Telugu Global
National

డీఎంకే శ్రేణులను రెచ్చగొట్టొద్దు.. - బీజేపీకి స్టాలిన్ వార్నింగ్

సెంథిల్ బాలాజీపై ఈడీ ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయనకు ఛాతి నొప్పి వచ్చిందని చెప్పారు. బీజేపీని ఎవరైతే వ్యతిరేకిస్తారో అటువంటి వారిపై దేశవ్యాప్తంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయని స్టాలిన్ విమర్శించారు.

డీఎంకే శ్రేణులను రెచ్చగొట్టొద్దు.. - బీజేపీకి స్టాలిన్ వార్నింగ్
X

డీఎంకేను, తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టవద్దని.. ఇది బెదిరింపు కాదు.. నా హెచ్చరిక అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీజేపీపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఎప్పుడో పదేళ్ల కిందట వ్యవహారమై ఇప్పుడు తమ పార్టీకి చెందిన మంత్రిని అరెస్టు చేసి ఇంతగా హింస పెట్టడం ఏంటని ఆయన కేంద్రంపై మండిపడ్డారు.

పదేళ్ల కిందట మంత్రి సెంథిల్ బాలాజీ అప్పటి ప్రభుత్వంలో రవాణా సంస్థలో ఉద్యోగుల నియామకంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఆయన రవాణా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లతో కలిసి అభ్యర్థుల వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.

ఈ వ్యవహారమై ఇటీవల మంత్రి కార్యాలయాలు, ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి ఆయనను అరెస్టు చేసింది. గంటల తరబడి మంత్రిని విచారించింది. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన సెంథిల్ బాలాజీ ఆసుపత్రి పాలయ్యారు.

కాగా, దీనిపై తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. పదేళ్ల క్రితం ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికిప్పుడు తొందరపడి బాలాజీని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఈడీని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తు నిర్వహించే విధానాన్ని తాను తప్పు అని చెప్పడం లేదని, అరెస్టు అయిన వ్యక్తి సామాన్య వ్యక్తి కాదన్నారు. బాలాజీ ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, రెండుసార్లు మంత్రిగా పనిచేశారని .. అటువంటి వ్యక్తిని ఉగ్రవాదిలా ఎందుకు లాక్కెళ్లాల్సి వచ్చిందని సీఎం ప్రశ్నించారు.

సెంథిల్ బాలాజీపై ఈడీ ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయనకు ఛాతి నొప్పి వచ్చిందని చెప్పారు. బీజేపీని ఎవరైతే వ్యతిరేకిస్తారో అటువంటి వారిపై దేశవ్యాప్తంగా ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు జరుగుతున్నాయని స్టాలిన్ విమర్శించారు. బెదిరింపుల్లో భాగంగానే బీజేపీ ఈ విధంగా చేస్తోందని ఆయన మండిపడ్డారు.

బీజేపీని శివసేన వ్యతిరేకిస్తే ఆ పార్టీకి చెందిన సంజయ్ రౌత్ ని అరెస్టు చేశారని, ఢిల్లీలో ఆప్ వ్యతిరేకిస్తే మనిశ్‌ సిసోడియాని అరెస్టు చేశారని, బీహార్ లో తేజస్వీ యాదవ్ పై దాడులు నిర్వహించారని స్టాలిన్ ఆరోపించారు. ఇలా వివిధ రాష్ట్రాల్లో తమను వ్యతిరేకించే వారిపై బీజేపీ బెదిరింపులకు దిగడం అలవాటుగా మారిందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

First Published:  15 Jun 2023 5:23 PM GMT
Next Story