Telugu Global
National

‘నీట్‌’ రద్దు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం

దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీటియూజీ–2024 పరీక్ష నిర్వహణపై ప్రస్తుతం దేశమంతటా గందరగోళం నెలకొన్న నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానం చర్చనీయాంశమైంది.

‘నీట్‌’ రద్దు కోరుతూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
X

వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ‘నీట్‌’ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సభలో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి విపక్ష నేతలు కూడా ఆమోదం తెలపడం గమనార్హం. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపులు జరపాలని ఈ సందర్భంగా త‌మిళ‌నాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

దేశ వ్యాప్తంగా వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే నీటియూజీ–2024 పరీక్ష నిర్వహణపై ప్రస్తుతం దేశమంతటా గందరగోళం నెలకొన్న నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీ చేసిన తీర్మానం చర్చనీయాంశమైంది. పరీక్షకు ముందే పేపర్‌ లీకేజీ జరిగినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో.. ఈ అంశంపై పార్లమెంట్‌లో చర్చ జరపాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.

ఈ అంశంపై డీఎంకే ఎంపీ కనిమొళి మాట్లాడుతూ.. నీట్‌ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. నీట్‌ పరీక్ష వద్దని తమిళనాడు పదేపదే చెబుతోందని గుర్తు చేసిన ఆమె.. నీట్‌ నిర్వహణ డొల్ల అని ఇప్పుడు రుజువైందన్నారు. ఈ పరీక్ష వల్ల విద్యార్థులు ఎంతో విలువైన భవిష్యత్తును కోల్పోతున్నారని చెప్పారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆధ్వర్యంలో మే 5న నీట్‌ యూజీ 2024 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 4,570 కేంద్రాల్లో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే.. 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం.. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన పలువురు విద్యార్థులకు ఫస్ట్‌ ర్యాంకు రావడం అనుమానాలకు దారితీసింది. ఓ వైపు దీనిపై సీబీఐ దర్యాప్తు జరుగుతుండగా.. నీట్‌ పీజీ–2024 పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసింది. మరోపక్క దీనిపై దాఖలైన పిటిషన్లపై న్యాయస్థానాల్లోనూ విచారణ కొనసాగుతోంది.

First Published:  28 Jun 2024 10:39 PM IST
Next Story