Telugu Global
National

హిందీని బలవంతంగా రుద్దితే దేశం మూడు ముక్కలు అవుతుంది : తమిళనాడు సీఎం స్టాలిన్

ఇది కేవలం భాషా పోరాటం కాదు.. తమిళం, తమిళ సంస్కృతిని రక్షించడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటామని సభ ద్వారా తమిళనాడు ప్రజలకు హామీ ఇస్తున్నానని స్టాలిన్ చెప్పారు.

హిందీని బలవంతంగా రుద్దితే దేశం మూడు ముక్కలు అవుతుంది : తమిళనాడు సీఎం స్టాలిన్
X

దేశంలో హిందీ ఒక్కటే అధికార భాషగా ఉంచాలని, ఇంగ్లీష్‌ను తొలగించి పూర్తిగా హిందీకే పట్టం కట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. నిర్బంధంగా హిందీని అమలు చేయాలని చూసినా, అందరిపై హిందీని రుద్దే ప్రయత్నం చేసినా దేశం మూడు ముక్కలు అవుతుందని అన్నారు. హిందీ భాషను నిర్బంధంగా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు. దానికి ముందు ముఖ్యమంత్రి స్టాలిన్ సుదీర్ఘంగా ప్రసంగించారు.

భాష అనేది మనందరి జీవితం. అదే మన చైతన్యం, మన భవిష్యత్తు. అలాంటి మహత్తరమైన మాతృభాషను కాపాడుకోవడానికి, అభివృద్ధి చేయడానికే ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పుట్టిందని స్టాలిన్ గుర్తు చేశారు. ఆధిపత్య భాషల నుంచి తమిళాన్ని కాపాడుకునేందుకు పార్టీ పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమిళ భాషకు డీఎంకే రక్షణ ఉద్యమంగా పని చేస్తోంది. తమిళనాడులో 1938 నుంచి హిందీని రుద్దడం ప్రారంభించారు. అప్పటి నుంచి తమిళులు అందరూ ప్రతిఘటిస్తూనే ఉన్నారని స్టాలిన్ అన్నారు.

ఇది కేవలం భాషా పోరాటం కాదు.. తమిళం, తమిళ సంస్కృతిని రక్షించడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటామని సభ ద్వారా తమిళనాడు ప్రజలకు హామీ ఇస్తున్నానని చెప్పారు. ఇండియన్ యూనియన్‌ను బీజేపీ పాలిస్తోంది. హిందీని నిర్బంధంగా అమలు చేయడమే తమ పద్దతిగా మార్చుకుంది. పరిపాలన అంశాల నుంచి విద్యా బోధన వరకు హిందీని తీసుకొని రావడానికి ప్రయత్నిస్తోంది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు, ఒకే మతం, ఒకే ఆహారం, ఒకే సంస్కృతి అంటూ వచ్చిన బీజేపీ.. ఇవ్వాళ ఒకే భాష కూడా అమలు చేస్తామని చెప్తోంది. ఇండియా భిన్న సంస్కృతులు, భాషలు, మతాలు కలిగిన దేశం. భిననత్వంలో ఏకత్వం వెతుక్కుంటూ గత ఏడున్నర దశాబ్దాలుగా కలిసి ఉన్నామని స్టాలిన్ అన్నారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియా ఏడాదికి మించి కలిసి ఉండదని అప్పట్లో అంతర్జాతీయ మీడియా వార్తలు రాసింది. కానీ మనం ఇన్నేళ్లు కలిసే ఉన్నాము. కానీ, ఆ వార్తలను ఇప్పటి కేంద్ర ప్రభుత్వంలోని పాలకులు నిజం చేసేలా ఉన్నారని స్టాలిన్ దుయ్యబట్టారు. తమిళనాడుది ద్విభాషా విధానం. ఇక్కడ తమిళంతో పాటు ఇంగ్లీషు కూడా అధికార భాషగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాల భాషలను అధికార భాషలుగా మార్చాలని స్టాలిన్ డిమాండ్ చేశారు.కేవలం హిందీ తెలిసిన వారికి మాత్రమే ఉద్యోగులు, చదవులో ప్రాధాన్యత ఇవ్వకూడదు. అది రాజ్యాంగానికి పూర్తిగా విరుద్దమని స్టాలిన్ చెప్పారు.

కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలోని అధికార భాషా పార్లమెంటరీ కమిటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ నివేదికను అందజేసింది. అందులో ఐఐటీ, ఐఐఎం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతున్న సెంట్రల్ యూనివర్సిటీలు, విద్యా సంస్థల్లో హిందీ శిక్షణ భాషగా ఉండాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇంగ్లీష్ బదులుగా హిందీ మాధ్యమంలో పాఠాలు బోధిస్తే భవిష్యత్ గందరగోళంగా మారుతుంది. మన పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు రావు. రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు తలెత్తుతాయని స్టాలిన్ అన్నారు. హిందీ భాషను ఎప్పటికీ నిర్బంధంగా అమలు చేయడానికి ఒప్పుకోమని స్టాలిన్ స్పష్టం చేశారు. తమిళ భాషను రక్షించుకోవడానికి ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని అన్నారు. కాగా, స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే సమయంలో బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడం గమనార్హం.

First Published:  19 Oct 2022 11:31 AM IST
Next Story