Telugu Global
National

గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులకు తమిళనాడు సర్కార్ ఆమోదం

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను తమిళనాడు సర్కార్ మళ్ళీ అసెంబ్లీలో ఆమోదించి పంపడంతో ఈసారి గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా.. అని అందరూ ఎదురుచూస్తున్నారు.

గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులకు తమిళనాడు సర్కార్ ఆమోదం
X

తమిళనాడు సర్కార్‌కు, ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రెండు మూడేళ్లుగా అసెంబ్లీలో అమోదించిన పలు కీలక బిల్లులను స్టాలిన్ సర్కార్ గవర్నర్‌కు పంపింది. అయితే ఏళ్ళు గడుస్తున్నప్పటికీ వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టేశారు. గవర్నర్ నిర్లక్ష్యంపై తమిళనాడు ప్రభుత్వం విమర్శలు చేసినప్పటికీ ఆర్ఎన్ రవి పట్టించుకోలేదు. దీంతో స్టాలిన్ ప్రభుత్వం ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో తగు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తన వద్ద పెండింగ్ లో ఉన్న 12 బిల్లుల్లో పది బిల్లులను వెనక్కి పంపుతూ ఇటీవల తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం మరింత వివాదాస్పదంగా మారింది. గవర్నర్ చర్యపై ముఖ్యమంత్రి స్టాలిన్ సహా మంత్రులు తీవ్ర విమర్శలు చేశారు.

తాజాగా ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరిచిన ప్రభుత్వం గవర్నర్ వెనక్కి పంపిన పది బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించారు. వాటిని తిరిగి గవర్నర్‌కే పంపారు. ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్లో 2020, 2023లలో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా, మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే యూనివర్సిటీల్లో వీసీల నియామకంలో గవర్నర్ అధికారాలను తగ్గించేలా తీసుకొచ్చిన తీర్మానం, 'నీట్' ను వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన‌ తీర్మానం ఉన్నాయి.

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను తమిళనాడు సర్కార్ మళ్ళీ అసెంబ్లీలో ఆమోదించి పంపడంతో ఈసారి గవర్నర్ ఆర్ఎన్ రవి ఈ బిల్లులపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా.. అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఈ బిల్లులను మళ్లీ గవర్నర్ పెండింగ్‌లో పెట్టినా, మళ్ళీ తిప్పి పంపినా తీవ్ర వివాదం చెలరేగే అవకాశం ఉంది. కాగా, కేంద్రంలోని బీజేపీ నియమించిన గవర్నర్ ఆర్ఎన్ రవి ఆ పార్టీ చెప్పినట్లు నడుచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ, దానికి మద్దతు ఇచ్చే అన్నా డీఎంకే పార్టీలు దూరంగా ఉండడం గమనార్హం.

First Published:  18 Nov 2023 7:24 PM IST
Next Story