రాజకీయ పార్టీ ప్రకటించిన తమిళ హీరో విజయ్
తమిళనాడులో జాతీయ పార్టీలకు ఆదరణ లేకపోవడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీనిని వినియోగించుకునేందుకు విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించారు.
తమిళనాడు రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తమిళ అగ్ర హీరో విజయ్ రాజకీయ పార్టీ నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. 'తమిళగ వెట్రి కళగం' పేరుతో ఆయన పార్టీ ప్రకటించారు. తమిళనాడులో రజినీకాంత్ తర్వాత అంతటి స్టార్డమ్ ఉన్న హీరో విజయ్. ఈయన రాజకీయాల్లోకి వస్తున్నట్లు చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా విజయ్ పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ వార్తలను విజయ్ ఖండించారు.
అయినప్పటికీ సందేశాత్మక చిత్రాల్లో నటించడం, సేవా కార్యక్రమాలు ముమ్మరం చేయడంతో విజయ్ రాజకీయాల్లోకి రావడం కన్ఫార్మ్ అని ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇటీవల ఆయన వరుసగా తన అభిమాన సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయం అయ్యింది.
సస్పెన్స్ కు తెర దించుతూ ఇవాళ విజయ్ రాజకీయ పార్టీ ప్రకటించారు. పార్టీ పేరును 'తమిళగ వెట్రి కళగం'గా పెట్టినట్లు ప్రకటించారు. తమిళనాడు రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని.. దానిని నిర్మూలించడమే తన ధ్యేయం అని విజయ్ అన్నారు. పార్టీ ఎజెండాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. గుర్తుకు సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తామని చెప్పారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని విజయ్ ప్రకటించారు.
తమిళనాడులో ప్రస్తుతం సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అధికారంలో ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ జయలలిత మరణం తర్వాత బలహీనపడింది. తమిళనాడులో జాతీయ పార్టీలకు ఆదరణ లేకపోవడంతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీనిని వినియోగించుకునేందుకు విజయ్ రాజకీయ పార్టీని ప్రకటించారు.
తమ అభిమాన కథానాయకుడు పార్టీ పేరును ప్రకటించడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ ఫ్యాన్స్ బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే తెలుగు నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమాకు ఓకే చెప్పారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.