ప్లీజ్..కొంత విశ్రాంతి తీసుకోండి.. మోడీకి మమత సూచన
'మీ తల్లి మరణానికి ఎలా సంతాపం చెప్పాలో నాకు తెలియడం లేదు. మీ అమ్మ మా అమ్మ. ఈ సమయంలో నేను నా తల్లిని గుర్తు చేసుకుంటున్నా' అని ప్రధానమంత్రి మోడీతో మమత అన్నారు.
ఇవాళ తెల్లవారుజామున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరా బెన్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇటీవలే 100వ పుట్టినరోజు జరుపుకున్న ఆమె మంగళవారం కొంత అస్వసతకు గురవడంతో అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ఇవాళ తెల్లవారుజామున మరణించారు. హీరా బెన్ మరణించిన కొన్ని గంటల్లోనే ఈ ఉదయం గుజరాత్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. హీరా బెన్ తెల్లవారుజామున 3.39 గంటలకు మరణించగా.. ఉదయం 9 గంటలకల్లా అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి.
షెడ్యూల్ ప్రకారం కొన్ని కార్యక్రమాలకు మోడీ హాజరు కావలసి ఉండడంతో ఆయన తన తల్లి అంత్యక్రియలను ఉదయాన్నే ముగించారు. స్వయంగా పాడె మోశారు. శుక్రవారం షెడ్యూల్ ప్రకారం పశ్చిమ బెంగాల్లో మోడీ పర్యటించాల్సి ఉంది. తన తల్లి మృతితో మోడీ ఈ కార్యక్రమాల్లో వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొంత విశ్రాంతి తీసుకోవాల్సిందిగా ప్రధానమంత్రి మోడీకి సూచించారు. ' ప్లీజ్ కొంచెం విశ్రాంతి తీసుకోండి. మీ తల్లి మరణానికి ఎలా సంతాపం చెప్పాలో నాకు తెలియడం లేదు. మీ అమ్మ మా అమ్మ. ఈ సమయంలో నేను నా తల్లిని గుర్తు చేసుకుంటున్నా' అని ప్రధానమంత్రి మోడీతో మమత అన్నారు. కొంతకాలంగా మమతా బెనర్జీ, మోడీ మధ్య ఉప్పు నిప్పులా వ్యవహారాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరా బెన్ మృతితో మమతా బెనర్జీ కొంత ఎమోషనల్ అయ్యారు. మోడీకి స్వాంతన చేకూరాల ఓదార్పు తెలపడం ఆసక్తికరంగా మారింది.