Telugu Global
National

జెండా ఎగరేయని ఇళ్ల ఫొటోలు తీయండి.. వారి సంగతి చూద్దాం..

స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని చెప్పడం బాగానే ఉంది. కానీ అలా ఎగరేయని ఇళ్ల ఫొటోలు తీయండి, వారి సంగతి చూద్దామంటూ ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

జెండా ఎగరేయని ఇళ్ల ఫొటోలు తీయండి.. వారి సంగతి చూద్దాం..
X

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ.. సోషల్ మీడియాలో దేశభక్తి పొంగి పొర్లుతోంది. సోషల్ మీడియా అకౌంట్లలో జాతీయ జెండాను డీపీగా పెట్టుకోనివారిని అనుమానంగా చూసే పరిస్థితి. వారికి దేశభక్తి లేదని అనుకునే సందర్భం. సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీ, సోషల్ మీడియా దేశభక్తిని ప్రోత్సహిస్తుండటంతో ప్రస్తుతానికి జాతీయవాదం అంతా ఇంటర్నెట్ లోనే కనిపిస్తోంది. ఇక హర్ ఘర్ తిరంగా అనే వ్యవహారం మరిత ఆసక్తిగా మారింది. జాతీయ జెండాను కొని ఎగరేసే స్థోమత అందరికీ లేదు. అందుకే జెండాలను ఉచితంగా పంచి పెట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. కానీ ప్రభుత్వానికి కూడా ఆ స్థోమత లేదని నిదానంగా బయటపడింది. కనీసం జెండాలను తయారు చేయించి పంపిణీ చేసేంత సమయం, సమర్థత కేంద్రానికి లేదు. అందుకే రేషన్ బియ్యం కావాలంటే జెండా కొనాల్సిందేనంటూ కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చి అభాసుపాలవుతోంది. దీనికి పరాకాష్ట జెండా ఎగరేయని ఇళ్ల ఫొటోలు తీయాలని ఓ బీజేపీ నేత ఇచ్చిన స్టేట్ మెంట్.

స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేయాలని చెప్పడం బాగానే ఉంది. కానీ అలా ఎగరేయని ఇళ్ల ఫొటోలు తీయండి, వారి సంగతి చూద్దామంటూ ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 'హర్ ఘర్ తిరంగ' డ్రైవ్‌ లో పాల్గొన్న ఆయన.. జాతీయ జెండాను ఇళ్లపై పెట్టుకోని వారు విశ్వసనీయ వ్యక్తులు కాదని చెప్పారు. అలాంటి ఇళ్లను ఫొటో తీసి తనకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. తర్వాత వారి సంగతి చూద్దామన్నారు. జాతీయ జెండాను ఇంటిపై ఎగరేస్తేనే దేశ భక్తి ఉన్నట్లా, లేకపోతే దేశభక్తి లేనట్టుగా భావించాలా అంటూ ఆయనపై విమర్శలు చెలరేగాయి. దీంతో భట్ వెనక్కి తగ్గారు.

బీజేపీ కార్యకర్తల ఇళ్ల విషయంలో..

జెండా ఎగరేయని ఇళ్ల ఫొటోలు తీయండి అని తాను చెప్పిన విషయం సామాన్య ప్రజానీకానికి కాదని, బీజేపీ కార్యకర్తలకే వర్తిస్తుందని అన్నారు మహేంద్ర భట్. ఎవరినీ అనుమానించడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు కూడా జెండా ఎగరేయకుండా ఉండటం సరికాదని, అందుకే తమ పార్టీ కార్యకర్తల ఇళ్లనే ఫొటోలు తీయాలని చెప్పానన్నారు. జాతీయ జెండాను ఇంటిపై ఉంచడంలో ఎవరికీ ఎలాంటి సమస్యలు లేనప్పుడు, దీనిపై అభ్యంతరం ఎందుకంటూ ఎదురు ప్రశ్నించారు. మొత్తమ్మీద స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటిపై జెండా, సోషల్ మీడియా దేశభక్తి విషయంలో దేశవ్యాప్తంగా నాయకుల మాటలు వివాదాలకు కారణం అవుతున్నాయి.

First Published:  13 Aug 2022 8:24 AM IST
Next Story