'పార్లమెంటులో ఆ పదాలు వాడుతా.. నన్ను సస్పెండ్ చేయండి..'
పార్లమెంటులో కొన్ని పదాలను వాడరాదంటూ లోక్ సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బుక్ లెట్ ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రిన్ అపహాస్యం చేశారు
పార్లమెంటులో కొన్ని పదాలను వాడరాదంటూ లోక్ సభ సెక్రటేరియట్ విడుదల చేసిన బుక్ లెట్ ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రిన్ అపహాస్యం చేశారు. 'జమాల్ జీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ స్ప్రెడర్', 'స్నూప్ గేట్' వంటి పదాలనే కాక , సాధారణంగా అందరూ మాట్లాడే 'సిగ్గుచేటు', 'అవినీతి', హిపోక్రసీ', 'డ్రామా', 'అసమర్ధుడు' లాంటి వర్డ్స్ కూడా అన్ పార్లమెంటరీ అవుతాయా అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఇలాంటి చాలావాటిని సభలో సభ్యులు పలకకుండా నిషేధిస్తున్నామని, ఇవి రికార్డులకెక్కబోవని ఈ బుక్ లెట్ లో పేర్కొన్నారని ఆయన అన్నారు. సభ్యులు డిబేట్ లో పాల్గొన్నప్పుడో, ప్రసంగం చేస్తున్నప్పుడో వీటిని అనుమతించబోమని హెచ్చరిక వంటిది చేశారని ఆయన ట్వీట్ చేశారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కానీ సిగ్గుచేటు, అసమర్ధుడు, అవినీతి వంటి మామూలు పదాలను కూడా బ్యాన్ చేశారు .. , కానీ వీటిని తాను వాడి తీరుతానని, తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ చేశారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడుతాం.. ఇది మా హక్కు అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ కే చెందిన మరో ఎంపీ మహువా మొయిత్రా కూడా .. డెరెక్ మాదిరే స్పందించారు. బీజేపీ ఈ దేశాన్ని ఎలా నాశనం చేస్తోందో విపక్ష సభ్యులు ఉపయోగించే పదాలనన్నింటినీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని వాటిని బ్యాన్ చేసిందని అపహాస్యం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునన్నారు. 'ట్రూథ్' (సత్యం) అన్ పార్లమెంటరీ అవుతుందా అని ఆమె ప్రశ్నించారు.
మరో వైపు అన్ పార్లమెంటరీ పదాల బ్యాన్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాంరమేష్ సైతం ఘాటుగా స్పందించారు. మోడీ ప్రభుత్వ 'అసలైన వాస్తవాల'ను అభివర్ణించడానికి ఉపయోగించే పదాలనన్నీ ఇక అన్ పార్లమెంటరీగా పరిగణించాల్సి ఉంటుందని ట్వీట్ చేశారు. దీని తరువాత ఏమిటి 'విష్ణుగురూ' అని సెటైర్ వేశారు.
అయితే పార్లమెంటు ఇలాంటి బుక్ లెట్ ని విడుదల చేయడం వెనుక లోగడ మధ్యప్రదేశ్ అసెంబ్లీ.. ఇందుకు తొలి అడుగు వేసినట్టు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టులో ఆ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు .. ఇలాంటి ప్రయత్నమే చేసింది. మొత్తం 1560 పదాలను అన్ పార్లమెంటరీగా పేర్కొంటూ ఓ బుక్ లెట్ ని సభలో విడుదల చేసింది. 'పప్పు', '420', 'ఫేకు', 'ఉల్లూ కే ఫట్టే' లాంటి పదాలు వీటిలో ఉన్నాయి. సభ్యులెవరైనా వీటిని వాడిన పక్షంలో రికార్డులనుంచి తొలగిస్తానని స్పీకర్ గిరీష్ గౌతమ్ హెచ్చరించారు. భారత రాజ్యాంగంలోని 105 (2) అధికరణం కింద సభ్యులు ఈ విధమైన పదాలను సభలో వాడరాదని అన్నారు. అయితే ఇక్కడ ఓ ఆసక్తికరమైన అంశమొకటి ఉంది. పార్లమెంట్ క్రోడీకరించిన పుస్తకాల సాయంతో తామీ అన్ పార్లమెంటరీ పదాలను ఏర్చి కూర్చామని మధ్యప్రదేశ్ అధికారులు తెలిపారు. ఇందుకు తమకు మూడు నెలల సమయం పట్టిందన్నారు. బందిపోటు, మోసకారి, అబధ్దాలకోరు, లంచం వంటి ఇంకా ఎన్నో పదాలను కూడా ఈ పుస్తకంలో బ్యాన్ చేశారు. ఇప్పుడు దేశ అత్యున్నత చట్ట సభ ఇన్నాళ్లకు ఇలాంటి బుక్ లెట్ ని రిలీజ్ చేసింది. కానీ అప్పుడే తృణమూల్ ఎంపీ డెరెక్ ఈ ప్రయోగం పట్ల నిరసన వ్యక్తం చేశారు. సాధారణ పదప్రయోగాలను సైతం అనుచితంగా పరిగణించడమేమిటన్న ప్రశ్నకు అధికార పార్టీ నుంచి సమాధానం రావలసి ఉంది.
ఇక బ్రిటన్ లోని కామన్స్ సభలో ఏ సభ్యుడైనా అనుచిత పదం వాడినప్పుడు అతడిని క్రమశిక్షణారాహిత్య సభ్యుడిగా పేరు పెట్టి మరీ స్పీకర్ ప్రకటించే నిబంధన ఉంది.