`లైక్` చేశాడు.. దోచేశారు.. - యూట్యూబ్ వీడియోల మాటున కొత్త తరహా సైబర్ మోసం
గురుగ్రామ్‌కు చెందిన సిమ్రన్ జీత్ సింగ్ నందాకు కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో తాము చెప్పిన వీడియోలకు లైక్ కొడితే.. ప్రతి లైక్‌కీ రూ.50 చెల్లిస్తామని అందులో పేర్కొంది.
ఇప్పుడంతా యూట్యూబ్‌లో వీడియోలదే హవా. ఆదాయ మార్గంగా ఉండటంతో పలువురు రకరకాల వీడియోలు తీసి వీటిని పోస్ట్ చేస్తున్నారు. షార్ట్ వీడియోల పేరుతో యూట్యూబ్‌లో కనిపిస్తున్న వీటిని జనం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఒకదాని తర్వాత మరోటి సమయం కూడా తెలియని విధంగా చూస్తూ వీటికి జనం ఆకర్షితులవుతున్నారు. తమకు నచ్చిన వాటికి లైక్‌లు కూడా కొడుతున్నారు. ఆ లైక్‌లను బట్టే ఈ వీడియోలు పోస్ట్ చేసేవారికి ఆదాయం పెరుగుతుంది. సరిగ్గా ఇదే పాయింట్‌ని ఆసరాగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు నయా మోసానికి తెరతీశారు.
లైక్ కొట్టండి.. పారితోషికం అందుకోండి.. అంటూ పలువురికి వాట్సాప్‌లో మెసేజ్ చేస్తున్నారు. అలా తమ వలలో పడినవారి ఖాతాల నుంచి నగదు దోచేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన గురుగ్రామ్ కు చెందిన ఓ వ్యక్తి ఇలా సైబర్ మోసగాళ్ల వలలో పడి రూ.8.50 లక్షల నగదు కోల్పోయాడు. అదెలాగంటే..
గురుగ్రామ్‌కు చెందిన సిమ్రన్ జీత్ సింగ్ నందాకు కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో తాము చెప్పిన వీడియోలకు లైక్ కొడితే.. ప్రతి లైక్‌కీ రూ.50 చెల్లిస్తామని అందులో పేర్కొంది. ఇదేదో చాలా బాగుందని.. చాలా ఈజీగా డబ్బు వచ్చేస్తుందని ఆశపడిన నందా.. సైబర్ నేరగాళ్లు చెప్పినట్టు చేసేందుకు ఓకే చెప్పాడు.
ఆ తర్వాతి రోజే అతనికి ఓ ఫోన్ కాల్ వచ్చింది. నందాతో ఓ మహిళ మాట్లాడుతూ యూట్యూబ్‌లో లైక్స్ కొట్టాల్సిన ఒప్పందానికి సంబంధించి వ్యాపారపరమైన నిర్వహణ ఖర్చుల కోసం కొంత నగదు జమ చేయాలని చెప్పింది. నగదు పంపేందుకు లింక్ పంపుతున్నామని చెప్పింది. ఆమె పంపిన లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత నందా బ్యాంకు ఖాతా నుంచి విడతలవారీగా రూ.8.50 లక్షల నగదు బదిలీ అయిపోయింది. దీనిని గుర్తించిన నందా తనకు ఫోన్ చేసినవారికి కాల్ చేసినా.. అటువైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన నందా.. పోలీసులను ఆశ్రయించాడు.