బ్రాహ్మణేతర అర్చకులు.. తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు..
అన్ని కులాలవారికీ అర్చకత్వం చేసే హక్కు ఉందని, తాము అధికారంలోకి వస్తే అందరికీ అవకాశమిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు స్టాలిన్. దాని ప్రకారమే ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇప్పించారు.
ఎన్నికల హామీ ప్రకారం అధికారంలోకి వచ్చాక 208 మంది బ్రాహ్మణేతరులకు అర్చకులుగా ఉద్యోగాలిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. వారికి శిక్షణ ఇచ్చి, విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి నియామక పత్రాలిచ్చారు. వారంతా విధుల్లో చేరిపోయారు. అయితే స్టాలిన్ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు నియామకాలపై వివరణ కోరుతూ స్టాలిన్ ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది.
అన్ని కులాలవారికీ ప్రాధాన్యం..
అన్ని కులాలవారికీ అర్చకత్వం చేసే హక్కు ఉందని, తాము అధికారంలోకి వస్తే అందరికీ అవకాశమిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు స్టాలిన్. దాని ప్రకారమే ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇప్పించారు. హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ విభాగంలో 208 మందికి అర్చక ఉద్యోగ నియామక పత్రాలు అందించారు.
కరిణానిధిలాగే..
స్టాలిన్ నిర్ణయంపై అణగారిన వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి, అయితే కొంత మంది మాత్రం తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందులో సుబ్రహ్మణ్యస్వామి ఒకరు. తండ్రి కరుణానిధి లాగే, తనయుడు స్టాలిన్ కూడా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీం నోటీసులతో ఇప్పుడీ వ్యవహారం మరోసారి వార్తల్లోకెక్కింది.