అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈబీసీ రిజర్వేషన్లకు సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. ఇందుకు సంబంధించిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు సోమవారంనాడు కీలక తీర్పు వెలువరించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్ధించింది. ఇందుకు సంబంధించిన 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ పరిమితి కారణంగా ఈడబ్ల్యూఎస్ కోటా రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్నిఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ రిజర్వేషన్ల రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో సిజెఐ తో పాటు నలుగురు న్యాయమూర్తులు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్ధి వాలా రిజర్వేషన్లను సమర్ధించగా, జస్టిస్ రవీంద్రభట్ మెజారిటీ సభ్యుల నిర్ణయంతో విభేదించారు.
1992లో సుప్రీంకోర్టు నిర్దేశించిన రిజర్వేషన్లపై జాతీయ స్థాయి 50 శాతం పరిమితిని కోటా ఎలా దాటగలదని, రాజ్యాంగంలోని 'ప్రాథమిక నిర్మాణాన్ని' మార్చారా అంటూ 103 రాజ్యాంగ సవరణను వ్యతిరేకిస్తూ తమిళనాడు సహా 40 పిటిషన్లు దాఖలు అయ్యాయి.
"ఆర్థిక వెనుకబాటుతనం ఈ సవరణకు వెన్నెముక. ఈ సవరణ రాజ్యాంగపరంగా అజేయమైనది. అయితే, షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు (ఓబిసి) వంటి తరగతులను మినహాయించడం రాజ్యాంగం అనుమతించదు" అని జస్టిస్ భట్ అన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వం అగ్రవర్ణాలలో ఆర్దికంగా వెకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల కల్పనలో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 103 వ రాజ్యాంగ సవరణ చేసింది. కాంగ్రెస్ పార్టీ సహా ఇతర విపక్షాలేవీ ఈ సవరణను వ్యతిరేకించలేదు.