Telugu Global
National

అబార్ష‌న్ల‌పై సుప్రీం కోర్టు చారిత్ర‌క తీర్పు

ఏకాభిప్రాయంతో గర్భం దాల్చినప్పటికీ, 24 వారాల వరకు తమ గర్భాన్ని అబార్షన్ చేసుకునేందుకు వివాహితులు, అవివాహితులు అనే తేడా లేకుండా మహిళలందరూ అర్హులేన‌ని సుప్రీంకోర్టు గురువారం ఒక చారిత్రక తీర్పులో స్ప‌ష్టం చేసింది.

అబార్ష‌న్ల‌పై సుప్రీం కోర్టు చారిత్ర‌క తీర్పు
X

వివాహిత, అవివాహిత స్త్రీల మధ్య ఎటువంటి వ్యత్యాసాల‌ను చూడ‌కూడ‌ద‌ని, ఆ తేడాను కొనసాగించలేమ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. మ‌హిళ‌లు త‌మ హక్కులను స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి వారికి స్వయం నిర్ణ‌యాధికారం ఉండాలని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. అబార్ష‌న్ల విష‌యంలో మ‌హిళ‌ల‌దే తుది నిర్ణ‌యం అని చెప్పింది.

ఏకాభిప్రాయంతో గర్భం దాల్చినప్పటికీ, 24 వారాల వరకు తమ గర్భాన్ని అబార్షన్ చేసుకునేందుకు వివాహితులు, అవివాహితులు అనే తేడా లేకుండా మహిళలందరూ అర్హులేన‌ని సుప్రీంకోర్టు గురువారం ఒక చారిత్రక తీర్పులో స్ప‌ష్టం చేసింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టాన్ని(ఎంటిపి యాక్ట్‌) వివరిస్తూ.. పెళ్లైన స్త్రీ, అవివాహిత మహిళ మధ్య వ్యత్యాసాన్ని కొనసాగించలేమని, వివాహిత స్త్రీలతో సమానంగా అవివాహిత మహిళ కూడా 24 వారాల వరకు అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. భర్తలు చేసే లైంగిక వేధింపులు అత్యాచారం రూపంలోనే ఉంటాయని, అబార్షన్ ప్రయోజనాల కోసం ఎంటిపి చట్టం, నిబంధనలలో అత్యాచారం అంటే వైవాహిక అత్యాచారం అనే అర్థాన్ని తప్పనిసరిగా చేర్చాలని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఎంటిపి చట్టం సామాజిక వాస్తవాలను ప్రతిబింబించేలా ఉండాల‌ని జస్టిస్ డి.వై. చంద్రచూడ్ అన్నారు. సమాజం మారినప్పుడు సామాజిక విధానాలు మారుతూ అభివృద్ధి చెందుతుంటాయి. అటువంట‌ప్పుడు చట్టాలు స్థిరంగా ఉండిపోయి పాత‌బ‌డి పోకూడదు. వాటిని కూడా సంస్క‌రించుకోవాల్సి ఉంది. మారుతున్న సామాజిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా చ‌ట్టాలు మార్చుకోవాల్సివ ఉంటుంద‌ని జ‌స్టిస్ చంద్ర‌చూడ్ వ్యాఖ్యానించారు.

"సురక్షితం కాని అబార్షన్‌లను నివారించవచ్చు. మ‌హిళ మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. గర్భిణీ స్త్రీ ఉన్న ప‌రిస్థితుల‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి" అని సుప్రీంకోర్టు పేర్కొంది. "లైంగిక వేధింపులు లేదా అత్యాచారం నుండి బయటపడినవారిలో వివాహితులు కూడా భాగం కావచ్చు. భర్త ఏకాభిప్రాయం లేని చర్య కారణంగా ఒక స్త్రీ గర్భవతి కావచ్చు. సెక్స్, లింగ వివ‌క్ష హింస అన్ని రకాలుగా కుటుంబాలలో భాగం" అని చంద్రచూడ్ అన్నారు. మొత్తం మీద సుర‌క్షిత‌మైన అబార్ష‌న్ చేయించుకునేందుకు ఎటువంటి తేడాలు లేకుండా మ‌హిళ‌లు త‌మ హ‌క్కును నిర‌భ్యంత‌రంగా ఉప‌యోగంచుకోవ‌చ్చు అని స్ప‌ష్టం చేసింది స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.

First Published:  29 Sept 2022 12:40 PM IST
Next Story