Telugu Global
National

పతంజలికి ఘాటు హెచ్చరిక.. కేంద్రానికి చీవాట్లు

ప్రకటనలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నా.. కేంద్రం కళ్లు మూసుకుని ఉండటమేంటని మండిపడింది సుప్రీంకోర్టు. ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.

పతంజలికి ఘాటు హెచ్చరిక.. కేంద్రానికి చీవాట్లు
X

కరోనా ఔషధాలంటూ ఆయుర్వేద మందులతో ప్రజలకు టోపీ పెట్టాలని చూసిన పతంజలి సంస్థకు గతంలోనే కోర్టులు చీవాట్లు పెట్టాయి. ఇప్పుడు మరోసారి సుప్రీంకోర్టు ఆ సంస్థపై తీవ్ర స్థాయిలో మండిపడింది. తప్పుడు ప్రకటనలు వెంటనే ఆపివేయాలని హెచ్చరించింది. ఇలాంటి ప్రకటనలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నా.. కేంద్రం కళ్లు మూసుకుని ఉండటమేంటని మండిపడింది. ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పింది.

ఆయుర్వేద ఉత్పత్తులకోసం మొదలు పెట్టిన పతంజలి సంస్థ ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలా ఎదిగింది. సదరు సంస్థకు బీజేపీ ప్రభుత్వ సహకారం బహిరంగ రహస్యం. బాబా రామ్ దేవ్ సహా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణతో బీజేపీ నేతల సంబంధాలు అందరికీ తెలుసు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పతంజలి దూకుడు పెరిగింది. కేంద్రం నుంచి ప్రత్యేక ప్రయోజనాలు అందుకుంటూ చెలరేగిపోయారు బాబా రామ్ దేవ్. అదే ఊపులో కరోనాకి కూడా మందు తయారు చేశామని ప్రకటించారు, బీజేపీ నేతలతో కూడా ప్రచారం చేయించారు. చివరకు కోర్టు చీవాట్లు పెట్టే సరికి కరోనా అనే పేరు తొలగించి అమ్ముకున్నారు. అయితే పతంజలి ప్రకటనలు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ అల్లోపతి వైద్యులు చాన్నాళ్లుగా ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు కళ్లు మూసుకుని ఉన్నారంటూ కేంద్రానికి చీవాట్లు పెట్టింది.

బాబా రావ్ దేవ్, బాలకృష్ణకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మళ్లీ కోర్టు అనుమతించే వరకు పతంజలి ఆయుర్వేదిక్ మెడికల్ ఉత్పత్తులపై ఎలాంటి ప్రకటనలు వద్దని కోర్టు ఆదేశించింది. తప్పుదోవ పట్టించే వైద్య ప్రకటనల సమస్యకు పరిష్కారం కనుగొనాలంటూ కేంద్రం తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు కోరింది.

First Published:  27 Feb 2024 6:11 PM IST
Next Story