Telugu Global
National

సుప్రీంలో అదానీకి చుక్కెదురు.. గోడౌన్ల విషయంలో వ్యతిరేక తీర్పు

AP SEZ విషయంలో సుప్రీంకోర్ట్ తీర్పుతో అదానీ గ్రూప్ కి చుక్కెదురైంది. పోర్ట్ ల నిర్వహణకు అనుమతి ఇచ్చినంత మాత్రాన, ఏకంగా సముద్రాలను, ఓడరేవుల్ని రాసిచ్చేసినట్టు కాదనే విషయం బోధపడింది.

సుప్రీంలో అదానీకి చుక్కెదురు.. గోడౌన్ల విషయంలో వ్యతిరేక తీర్పు
X

కేంద్ర ప్రభుత్వం అండతో అదానీ గ్రూప్ దాదాపు అన్ని రంగాల్లోకి వచ్చేసింది. అయితే ఆయా రంగాల్లో తన గుత్తాధిపత్యం కోసం ఏకంగా ప్రభుత్వ రంగ సంస్థలనే టార్గెట్ చేయడం మాత్రం ఇక్కడ విశేషం. దీన్ని గుజరాత్ హైకోర్ట్ సమర్థించినా సుప్రీంకోర్ట్ మాత్రం మొట్టికాయ వేసింది. పరిధి దాటొద్దంటూ హెచ్చరించింది. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో ఉన్న స్థలంలో కేంద్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్ల నిర్వహణ చేపట్టకూడదంటూ గుజరాత్ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని కొట్టివేసింది.

అసలేం జరిగిందంటే.. ?

అదానీ పోర్ట్స్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ లిమిటెడ్‌(AP SEZ)కు గుజరాత్ లో గిడ్డంగులు నిర్వహించుకోడానికి ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించింది. అయితే అప్పటికే అక్కడ కేంద్ర గిడ్డంగి కార్పొరేషన్‌(CWC) రెండు భారీ గోడౌన్లను నిర్వహిస్తోంది. 34 ఎకరాల పరిధిలో ఉన్న ఈ గోడౌన్లను వెంటనే ఖాళీ చేయాలంటూ AP SEZ హుకుం జారీ చేయడం ఇక్కడ విశేషం. అనుమతి తీసుకోండి లేదా ఖాళీ చేసి వెళ్లిపోండి అంటూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన CWCకి అదానీ పోర్ట్స్ యాజమాన్యం లేఖ రాసింది. దీనిపై CWC గుజరాత్ హైకోర్ట్ ని ఆశ్రయించింది. గుజరాత్ హైకోర్ట్ లో అదానీ పోర్ట్స్ కి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆ తర్వాత CWC సుప్రీంని ఆశ్రయించింది.

గుజరాత్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్ట్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆ తీర్పుని కొట్టివేసింది. ప్రభుత్వం నుంచి స్థలం తీసుకుని, అందులో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రవేశం లేదంటే కుదరదని చెప్పింది. సామరస్యంగా వివాదం పరిష్కరించుకోవాలని సూచించింది. ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. AP SEZ విషయంలో సుప్రీంకోర్ట్ తీర్పుతో అదానీ గ్రూప్ కి చుక్కెదురైంది. పోర్ట్ ల నిర్వహణకు అనుమతి ఇచ్చినంత మాత్రాన, ఏకంగా సముద్రాలను, ఓడరేవుల్ని రాసిచ్చేసినట్టు కాదనే విషయం బోధపడింది. గుజరాత్ తో మొదలు పెట్టి, ఏపీలో కూడా ప్రస్తుతం AP SEZ సంస్థ వరుసగా ఓడ రేవుల్ని చేజిక్కించుకుంటోంది. నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు ఇదివరకే అదానీ వ‌శం అయింది. ఇటీవల విశాఖలోని గంగవరం పోర్ట్ లో 100 శాతం వాటా అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.

First Published:  14 Oct 2022 12:07 PM IST
Next Story