మనీలాండరింగ్ కేసుల్లో ఈడీ అరెస్టులు చేయవచ్చు.. సుప్రీంకోర్టు
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED)కు ఉన్న అధికారాల రాజ్యాంగబద్దతపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై జస్టిస్ ఏఎం. ఖన్విల్కర్ అధ్వర్యాన గల బెంచ్ తీర్పునిస్తూ ఈడీకి ఉన్న అధికారాలు సరైనవే అని తేల్చి చెప్పింది.
మనీలాండరింగ్ కేసుల్లో .. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద ఈడీ అధికారులు నిందితులను విచారించవచ్చునని, అరెస్టు చేసి, వారి ఆస్తులను ఎటాచ్ చేయవచ్చునని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ లోని 5,8 (4), 15, 17, 19 సెక్షన్ల రాజ్యాంగ బధ్ధతను కోర్టు సమర్థించింది. ఈ సెక్షన్లు.. ఆయా వ్యక్తులను అరెస్టు చేసి.. వారి ఆస్తుల స్వాధీనం, సోదాలకు సంబంధించి ఈడీకి అధికారాలను కల్పిస్తున్నాయి.
ఈడీ పోలీసు విభాగం కాదు కాబట్టి నిందితుల ఎంక్వయిరీ సందర్భంగా ఈ సంస్థల అధికారులు రికార్డు చేసే వాంగ్మూలాలు కోర్టులో చెల్లుబాటవుతాయని కోర్టు పేర్కొంది. మనీలాండరింగ్ కేసుల్లో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకుంటున్న సందర్భంలో అతని అరెస్టుకు గల కారణాలను ఈడీ అధికారులు తప్పనిసరిగా వెల్లడించాల్సిన అవసరం లేదని, అలాగే నిందితునికి ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్ మేషన్ రిపోర్ట్ (ECIR)కాపీని ఇవ్వవలసిన అవసరం కూడా లేదని జస్టిస్ ఏఎం. ఖన్విల్కర్ ఆధ్వర్యాన గల బెంచ్ పేర్కొం ది.
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంలోని వివిధ సెక్షన్ల చెల్లుబాటును కోర్టు సమర్థిస్తూ ఇందులోని నిబంధనలు చట్టబద్దమైనవని, నిరంకుశమైనవి కావని పేర్కొంది. బెయిల్ మంజూరుకు ఈ నిబంధనలు చాలా కఠినతరంగా ఉన్నాయన్న పిటిషనర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు.
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టంలోని వివిధ సెక్షన్ల చెల్లుబాటును సవాలు చేస్తూ వందకు పైగా పిటిషన్లు దాఖలు కాగా.. వాటిన్నింటిని ఒకే బెంచ్ పైకి తీసుకొచ్చి జస్టిస్ ఖన్విల్కర్ విచారించారు. ఈ చట్టం కింద వ్యక్తుల అరెస్టు, బెయిలు మంజూరు, ఆస్తుల జప్తునకు సంబంధించిన అధికారాలు క్రిమినల్ కోడ్ ప్రొసీజర్ పరిధిలోకి రావు ..కానీ ఈ దర్యాప్తు సంస్థలు పోలీసు అధికారాలను ఉపయోగించుకుంటున్నాయని, ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ని ఫాలో అవుతున్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు.
నిందితులకు సమన్లు జారీ చేయడం, సాక్షులను విచారించడం వారి ఆస్తులను సీజ్ చేయడంవంటివి వ్యక్తుల స్వేచ్చా ప్రాథమిక హక్కులను అతిక్రమించడమేనని పిటిషనర్లు పేర్కొన్నారు. మనీలాండరింగ్ కి శిక్ష గరిష్టంగా ఏడేళ్ల జైలు అని, ఈ కారణంగా ఈ చట్టం కింద బెయిలు మంజూరు చాలా కష్టతరంగా ఉందని తమ పిటిషన్లల్లో వివరించారు. అలాగే సెక్షన్ 50 ప్రకారం .. ఎవరినయినా పిలిపించడం, వారి వాంగ్మూలాలను రికార్డు చేయడం, బలవంతంగా డాక్యుమెంట్లపై సంతకాలు చేయించడం వంటివి చేస్తున్నారని, ఇవన్నీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని అన్నారు. అయితే కేంద్రం తన వాదనను సమర్థించుకుంటూ.. ఇది ప్రత్యేక చట్టమని, దీనికి సొంత ప్రొసీజర్లు ఉన్నాయని వివరించింది. మనీ లాండరింగ్ దేశ ఎకానమీకి తీవ్రమైన ముప్పు అని, దీన్ని ఎదుర్కోవాలంటే కఠినమైన చట్టం ఉండాల్సిందే అని పేర్కొంది.